జనసేనలోకి మాజీ మంత్రి వట్టి ..?       2018-05-20   02:05:34  IST  Bhanu C

కర్ణాటకలో జేడీఎస్ అధినేత కుమార స్వామి సీఎం పీఠం ఎక్కెయ్యబోతున్నాడు. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ కూడా జెట్ స్పీడ్ తో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అక్కడ ఆయన పీఠం ఎక్కబోతే ఇక్కడ ఈయన హడావుడి ఏంటో అర్ధం కాలేదా ..? ప్రస్తుతం పవన్ జనాంజనను జేడీఎస్ తో పోల్చుకుంటున్నాడు. అక్కడ తక్కువ సీట్లు వచ్చినా ఆయన సీఎం పీఠం ఎక్కబోతున్నాడు… రేపు ఏపీలో నా పరిస్థితి కూడా అలాగే ఉంటే నేనే సీఎం అవ్వచ్చేమో కదా అని ఊహించుకుంటూ స్పీడ్ పెంచేసాడు.

అందుకే పార్టీలో బలమైన నాయకులను చేర్చుకుని ఎన్నికల నాటికి మరింత బలమైన పార్టీగా జనసేనాని తీర్చిదిద్దాలని చూస్తున్నాడు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవాలని పవన్ చూస్తున్నాడు. వసంత్ కి మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో స్నేహం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా వ్యవహరించారు వట్టి. ప్రస్తుతం కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రెండు రోజుల క్రితం విశాఖలో పవన్‌తో సమావేశం అయ్యి పార్టీలో చేరే విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది.

వసంత్ ది కాపు సామాజిక వర్గం. ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా ఆ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ . ఆ సమీకరణాల రీత్యా కూడా వట్టి జనసేనలోకి చేరవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు వట్టి. 2004,09 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి వసంత్ విజయం సాధించారు. ఇప్పుడు జనసేనలో చేరిక ద్వారా తిరిగి ఈయన జోష్‌మీదకు రావొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే తను పార్టీ మారనున్నాను అనే ఊహాగానాలను వట్టి ఖండించారు. పవన్ కల్యాణ్ తో రాజకీయాలేమీ చర్చించలేదని, మర్యాద పూర్వకంగానే తను పవన్‌ కల్యాణ్‌ను కలిశానని వసంత్ చెప్తున్నారు. జనసేన చేపట్టిన బస్సు యాత్రలో వట్టి చేరే అవకాశం కనిపిస్తోంది.