అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాది రెచ్చిపోయాడు.పాఠశాలలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.టెక్సాస్ రాష్ట్రంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
చనిపోయిన పిల్లలంతా 4 నుంచి 11 ఏళ్ల లోపు వారే కావడంతో తల్లిదండ్రులు, వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కాల్పులు జరిగిన ప్రదేశం రక్తంతో, చెల్లాచెదురుగా పడివున్న పసిపిల్ల మృతదేహాలతో స్మశానాన్ని తలపిస్తోంది.
మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డే నగరంలో వున్న రోడ్ ఎలిమెంటరీ పాఠశాలలో మంగళవారం ఈ ఘటన జరిగింది.ఈ స్కూల్లో మొత్తం 500 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు.
దుండగుడు పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్ధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు సాల్వాడర్ రామోస్ కూడా హతమయ్యాడు.మరోవైపు పాఠశాలలో జరిగిన కాల్పులపై టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గడిచిన కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటనగా ఆయన తెలిపారు.మృతుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని తెలియజేశారు.
అటు టెక్సాస్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశంలో గన్ లాబీకి వ్యతిరేకంగా నిలబడాలని ఆయన పేర్కొన్నారు.
పిల్లలు శాశ్వతంగా దూరమయ్యారనే క్షోభ తల్లిదండ్రులను వెంటాడుతూనే వుంటుందన్నారు.ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
అమెరికాలో ఇలాంటి వాటికి చోటివ్వకూడదని.చర్యలు తీసుకునేందుకు ధైర్యం చేయాలని ఆమె వ్యాఖ్యానించారు.
ఇకపోతే.2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్ధులు సహా ముగ్గురు టీచర్లు మరణించారు.ఇది అప్పట్లో యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.దాని తర్వాత తాజాగా టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటన అత్యంత దారుణమైనదిగా పోలీసులు చెబుతున్నారు.