వయోభారమో లేక కంగారు పడతారో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) తనకు తానుగా నవ్వుల పాలవుతున్నారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనది ఇదే తంతు.
మొన్నామధ్య కమలా హారీస్‌ను( Kamala Harris ) ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు బైడెన్.అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం ఆయన చెప్పలేక తడబడ్డారు.
తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా – ఉక్రెయిన్( Russia – Ukraine ) సమస్య గురించి ప్రస్తావించారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.ఇలా ఒకటి కాదు రెండు కాదు.బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు.

తాజాగా పెద్దాయన మరోసారి నెటిజన్లకు, విపక్షాలకు దొరికిపోయారు.అది కూడా చైనా విషయంలో.అమెరికాను పక్కకునెట్టి అగ్రరాజ్యంగా ఎదగాలని భావిస్తోన్న డ్రాగన్ ఇటీవలికాలంలో వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక ఇలా ఏ రంగంలోనైనా సరే పెద్దన్నకు ధీటుగా ఎదుగుతోంది.కరోనా సమయంలో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుదేలైనా చైనా మాత్రం తట్టుకుని నిలబడగలిగింది.
ప్రపంచానికి మ్యాన్‌ఫ్యాక్చరింగ్ హబ్‌గా మారిన చైనా ఇప్పుడు బలీయమైన శక్తిగా ఎదుగుతోంది.అమెరికా వ్యతిరేక శక్తులతో దోస్తీ చేస్తూ.దానికి పక్కలో బల్లెంలా మారింది.అందుకే ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్ధితులు వున్నాయి.

అలాంటిది అమెరికాకు అధ్యక్షుడిగా వున్న వ్యక్తి చైనాను పొగుడుతారా.కానీ అక్కడుంది బైడెన్ కదా.అసలేం జరిగిందంటే.అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జో బైడెన్ తొలిసారిగా కెనడా( Canada ) పర్యటనకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.ఈ క్రమంలో వలసల గురించి మాట్లాడుతూ.కెనడాను మెచ్చుకోవాల్సిన చోట పొరపాటున చైనా అని చెప్పారు.దీంతో అక్కడున్న వారికి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.
అయితే వెంటనే జరిగిన తప్పును గుర్తించిన జో బైడెన్.క్షమాపణలు చెప్పి, కెనడాను అభినందిస్తున్నా అని అన్నారు.
ఈ క్రమంలో పార్లమెంట్ సభ్యులంతా ఫక్కున నవ్వారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
