కరోనా చికిత్స పూర్తి: ఇవాళ జనంలోకి ట్రంప్... వైట్‌హౌస్ వేదికగా ప్రచార సభ

కరోనా బారినపడి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు.శనివారం వైట్‌హౌస్ ఆవరణలో ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.

 Us President Donald Trump To Resume Campaigning, Us President Donald Trump , Ame-TeluguStop.com

దీని తర్వాత సోమవారం అధికారికంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో యథావిధిగా పాల్గొంటానని ట్రంప్ వెల్లడించారు.దీనిలో భాగంగా సెంట్రల్ ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో అధ్యక్షుడు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

కాగా శనివారం జరిగే కార్యక్రమంలో ట్రంప్ బాల్కనీ నుంచే ప్రసంగించే అవకాశాలున్నాయని వైట్ హౌస్ వర్గాల సమాచారం.అలాగే సోమవారం శాన్‌ఫోర్డ్‌లో జరిగే కార్యక్రమానికి సైతం అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ప్రచార సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడంతో పాటు వారికి మాస్క్‌లు, శానిటైజర్లు అందజేయనున్నారు.
మరోవైపు అక్టోబర్ 15న అధ్యక్ష అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్- జో బిడెన్‌ల మధ్య జరగాల్సిన డిబేట్ రద్దయినట్లు ‘‘ కమీషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ (సీపీడీ) వెల్లడించిన సంగతి తెలిసిందే.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కి కరోనా సోకి, చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.అయితే చర్చలో పాల్గొనే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెండో డిబేట్‌ను వర్చువల్‌గా నిర్వహించాలని సీపీడీ నిర్ణయించింది.

కానీ దీనిపై ఇద్దరు నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి.దీంతో ముఖాముఖి నిర్వహించడం సాధ్యం కాదని సీపీడీ ప్రకటించింది.అయితే ఈ నెల 22న జరగాల్సిన చివరి సంవాదానికి మాత్రం ట్రంప్- బిడెన్ సుముఖత వ్యక్తం చేశారు.

మరోవైపు ట్రంప్‌నకు కోవిడ్‌ చికిత్స కోర్సు పూర్తయిందని డాక్టర్లు ప్రకటించారు.

గత శుక్రవారం నుంచి అధ్యక్షుడికి జ్వరం రావడంలేదని డాక్టర్లు తెలిపారు.వైట్‌హౌస్‌కు వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ బాగానే ఉన్నారని, కరోనా పెరిగిన దాఖలాలేమీ కనిపించలేదన్నారు.

ఆయన మునపటిలాగా ప్రజల్లోకి వెళ్లవచ్చని వైద్యులు చెప్పారు.కరోనా చికిత్స కోసం వాల్టర్ రీడ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చేరిన ట్రంప్‌ 4 రోజుల తర్వాత తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube