కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి విమాన రాకపోకలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం మనదేశంలో కోవిడ్ అదుపులోకి వస్తుండటంతో పలు దేశాలు ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి.
ఇప్పటికే యూఏఈ, బ్రిటన్‌లు భారతీయులను తమ దేశం రావడానికి అనుమతిస్తున్నాయి.తాజా అగ్రరాజ్యం అమెరికా కూడా భారతదేశంపై వున్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది.
ఈమేరకు అమెరికా నుంచి భారత్‌కు చేసే ప్రయాణాలకు సంబంధించి అడ్వైజరీ ‘స్థాయి(లెవెల్)’ని 3 నుంచి 2కి తగ్గించింది.ఈ మేరకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఆదేశాలు జారీ చేసింది.
ఎఫ్‌డీఏ అనుమతి పొందిన టీకాలు వేసుకున్న వారికి కోవిడ్ సంక్రమించే ప్రమాదం తక్కువగా వుంటుందని తెలిపింది.అందువల్ల ఏదైనా అంతర్జాతీయ ప్రయాణానికి ముందు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు, పూర్తికాని వారు సీడీసీ సిఫారస్సులను పరిశీలించాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే ఉగ్రవాదం, పౌర అశాంతి కారణంగా తూర్పు లడఖ్, దాని రాజధాని మినహా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి వెళ్లొద్దని అమెరికా పౌరులకు స్టేట్ డిపార్ట్‌మెంట్ సూచించింది.సాయుధ సంఘర్షణలకు అవకాశం వున్న భారత్ – పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేసింది.

కాగా, భారత్‌లో కోవిడ్ 19 సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది ఏప్రిల్ 30న భారత్‌పై ప్రయాణ ఆంక్షలు విధించారు.భారత్‌లో వున్న యూఎస్ పౌరులు కానీ వారిని అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.మరోవైపు కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నందున సీడీసీ, యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లు టర్కీకి వెళ్లవద్దని తమ పౌరులను హెచ్చరించాయి.లెవల్ 4 హై కోవిడ్ ట్రావెల్ అడ్వైజరీని టర్కీకి కేటాయించింది.
సోమవారం భారత్‌లో 32,937 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.వీటితో కలిపి ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 32,225,513కి చేరింది.
మహమ్మారి సోకి 417 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,31,642కి చేరుకుంది.యాక్టీవ్ కేసులు 3,81,947కి తగ్గాయి.
ఇది గడిచిన 145 రోజుల్లో అత్యల్పం.