గ్రేటర్ ఎన్నిలు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.మునుపెన్నడూ లేనివిధంగా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది.
ప్రచారానికి గడువు దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీస్పీడ్ పెంచేశాయి.మరోపక్క నేతలు తమ ప్రత్యర్ధి పార్టీలపై స్వరం పెంచేశారు.
రాజకీయ వ్యూహాలతో ఎవరికి వారు ఓటర్లను ఆకట్టుకునేందుకు ముందుకుపోతున్నారు.పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో మిగతా పార్టీలకంటే స్పీడ్ పెంచేసింది.
జాతీయ స్థాయి నేతలను రోజుకొక్కరిని ఎన్నికల ప్రచారంలోకి దింపుతోంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా శుక్రవారం రోడ్ షోలలో పాల్గొన్నారు.
రేపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను సైతం ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకత్వం నగరానికి రప్పిస్తోంది.ఏకంగా ఈయనను పాతబస్తీ ప్రచార కార్యక్రమం కోసమే నగరానికి రప్పించినట్లు తెలుస్తో్ంది.
అక్కడ ఉండే ఒక వర్గానికి చెందిన ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ పార్టీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
పాతబస్తీ పరిధిలో దాదాపు 50 డివిజన్లు ఉంటాయి.
ఇందులో దాదాపు 30 నుంచి 50 డివిజన్లను ఎంఐఎం పార్టీయే కైవసం చేసుకుంటూ వస్తోంది.గత ఎన్నికల్లోనూ 60 స్థానాల్లో పోటీ చేసి ఎంఐఎం 44 స్థానాల్లో గెలుపొందింది.
ఈ ఎన్నికల్లో 51 స్థానాల్లో పోటీ చేస్తోంది.అలాగే పాతబస్తీ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలోనూ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు.
అయితే ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చెక్ పెట్టేందుకు బీజేపీలో కీలకనేతగా ఉన్నయోగి ఆదిత్యనాథ్‌ను దింపుతున్నది.ఈయన ద్వారానే ఓట్లు చీలి అది తమ పార్టీకి బలం చేకూరుస్తుందని భావిస్తోంది.

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఏయిర్‌పోర్ట్‌కు యోగీ ఆదిత్యనాథ్ చేరుకుంటారు.అనంతరం మల్కాజ్‌గిరితోపాటు పాతబస్తీలో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.మధ్యాహ్నం 3 గంటలకు జీడిమెట్ల నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రోడ్ షో ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.సాయంత్రం 6 గంటల నుంచి పాతబస్తీలోని శాలిబండ, లాల్ దర్వాజలో ప్రచార సభలో పాల్గొననున్నారు.
అనంతరం తిరిగి రాత్రి 8 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.
ఇప్పిటికే కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, జేపీ నడ్డాతో పాటు పలువురు జాతీయ నాయకులు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
రేపు ప్రధాని నరేంద్ర మోడీ సైతం హైదరాబాద్‌లో ఓ అధికారిక పర్యటనలో భాగంగా నగరానికి వస్తున్నారు.కరోనా వ్యాక్సిన్‌ను భారత్ భయోటెక్ సంస్థ తయారు చేస్తుంది.
కోవాగ్జిన్ పురోగతిని పరిశీలించడానికి భారత్ బయోటెక్ కార్యాలయాన్నిమోడీ సందర్శించనున్నారు.అయితే మోడీ పర్యటనకు ఎన్నికలకు నేరుగా ఎలాంటి సంభందం లేకున్నాగానీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.