రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం రాజన్న సిరిసిల్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించనున్నారు.దేశవ్యాప్తంగా ఎంపీలు, మంత్రులంతా తమ తమ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మరిమడ్లలో ఉదయం 11 గంటలకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను, మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్లారెడ్డిపేటలోని దుమాల మోడల్ స్కూల్ ను సందర్శించనున్నారు.
ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న విద్యా బోధనతోపాటు విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులతో మాట్లాడనున్నారు.
దీంతోపాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపైనా ఆరా తీయనున్నారు.బోధనలో,సౌకర్యాల కల్పనలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను అగ్రభాగాన నిలపాలనే సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగానున్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ ను సందర్శించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.