కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన దేశాల నుంచి విమాన రాకపోకలతో పాటు ప్రయాణీకులను ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
అన్ని రకాల కోవిడ్ నిర్థారణా పరీక్షల ధరలను తగ్గించింది.దీని ప్రకారం 88 పౌండ్లుగా వున్న టెస్టింగ్ ధర 68 పౌండ్లుగా మారింది.
గ్రీన్ లిస్ట్ దేశాల్లోని భారత్ వంటి గమ్యస్థానాల నుంచి వచ్చే ప్రయాణీకులు, పూర్తి వ్యాక్సినేషన్ అయిన వారికి పీసీఆర్ టెస్ట్ కోసం 20 పౌండ్ల కంటే తక్కువ చెల్లిస్తే సరిపోతుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
అలాగే రెండు డోసుల వ్యాక్సినేషన్ జరగని వారికి రెండు టెస్టుల ధర 170 నుంచి 136 పౌండ్లకు తగ్గించారు.
వారు తమ దేశాల నుంచి బ్రిటన్ వచ్చిన రెండవ, ఎనిమిదవ రోజులలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.ధరల తగ్గింపు రెడ్ లిస్ట్ దేశాలకు వర్తించదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ (డీహెచ్ఎస్‌సీ) తెలిపింది.
నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) కరోనా పరీక్షలను చేయనుంది.
ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్‌లలో అంతర్జాతీయ ప్రయాణీకులు దోపిడికి గురవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో యూకే ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ స్పందించారు.
ప్రభుత్వం అనుమతించిన ధరలకే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.ధర స్పష్టంగా, పారదర్శకంగా వుండేలా gov.ukలో ప్రైవేట్ ప్రొవైడర్ల జాబితాను అందుబాటులో వుంచాలని సాజిద్ అధికారులను ఆదేశించారు.అలాగే పరీక్ష ధరలలో వ్యత్యాసాలను పరిష్కరించడానికి జావిద్ యూకే కాంపీటిషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ)ని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాల్సిందిగా సూచించారు.
కాగా, ప్రస్తుతం కరోనా పరిస్థితులు కాస్త మెరుగుపడినందున ఇండియాను రెడ్‌లిస్ట్ నుంచి తొలగించిన బ్రిటన్.అంబర్ లిస్ట్‌లో చేర్చింది.ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా హోటల్ క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

హోం క్వారెంటైన్‌లో ఉంటే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది.ఐదు రోజుల హోం క్వారెంటైన్ ఉన్న తర్వాత ‘టెస్ట్ టు రిలీజ్’ స్కీమ్ కింద సొంత ఖర్చులతో కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది.అందులో నెగెటివ్ వస్తే క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పింది.
ప్రయాణానికి 72 గంటల ముందు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది.అంతేకాకుండా బ్రిటన్‌కు చేరిన తర్వాత కరోనా టెస్ట్‌లు చేయించుకోవడానికి ముందుగానే స్లాట్‌లను బుక్ చేసుకోవాలని తెలిపింది.
సవరించిన ఈ ఆంక్షలు ఆగస్ట్ 8 నుంచి అమలులోకి వస్తాయని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాకుండా విజిట్, దీర్ఘకాలిక వీసాల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతోందని బ్రిటన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.