జ‌గ‌న్ నుంచి మ‌రో కోట చేజారుతోందా..!     2017-01-13   00:48:52  IST  Bhanu C

ఏపీలో ప్ర‌స్తుతం విప‌క్ష వైసీపీ చాలా గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి రాక‌పోయినా 67 సీట్లు గెలుచుకుని బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉన్నారు. అయితే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఎఫెక్ట్‌తో ప‌లువురు ఎమ్మెల్యేల‌తో పాటు ఒక‌రిద్ద‌రు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్ర‌ధాన నాయ‌కులు వ‌ర‌స‌పెట్టి సైకిలెక్కేశారు. జ‌గ‌న్ పార్టీ నుంచి ఎంత మంది ప్ర‌జాప్ర‌తినిధులు వెళ్లినా జ‌గ‌న్‌కు నిన్న‌టి వ‌ర‌కు కార్య‌క‌ర్త‌ల బ‌లం మాత్రం చెక్కుచెద‌ర్లేదు.

ఈ క్ర‌మంలోనే రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం మిన‌హా మిగిలిన మూడు జిల్లాల‌తో పాటు ప్ర‌కాశం-నెల్లూరు జిల్లాల్లో వైసీపీకు తిరుగులేని బ‌లం ఉంది. అధికార టీడీపీ క‌న్నా చాలా ఎక్కువ సీట్ల‌ను ఈ జిల్లాల్లో వైసీపీ గెలుచుకుంది. అయితే జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చ‌క కొంద‌రు, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు వ‌రుస‌పెట్టి సైకిల్ ఎక్కేయ‌డంతో క‌ర్నూలు జిల్లాల్లో టీడీపీ-వైసీపీతో స‌మానంగా వ‌చ్చేసింది.

ఇక ప్ర‌కాశం జిల్లాలో వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేయ‌డంతో ఆ జిల్లా జ‌గ‌న్ చేజారి టీడీపీ చేతిలోకి వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు వైసీపీ బ‌లంగా ఉన్న మ‌రో జిల్లా సైతం జ‌గ‌న్ చేజార‌నుందా ? అంటే అవున‌న్న ఆన్స‌రే ఏపీ పొలిటిక‌ల్ ఇన్న‌ర్ కారిడార్లో వినిపిస్తోంది. కోస్తాలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ చాలా బ‌లంగా ఉంది .గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 7 స్థానాలను వైసీపీ కైవ‌సం చేసుకుంది. గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చేశారు. సునీల్ త‌న‌పై ఉన్న కేసుల నుంచి త‌ప్పించుకునేందుకే టీడీపీలోకి వ‌చ్చార‌న్న టాక్ ఉంది.

ఇక ఇప్పుడు ఇదే క్ర‌మంలో జిల్లాకు చెందిన మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారన్న చర్చ న‌డుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవ‌ర్థ‌న్‌రెడ్డి, రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డిపై న‌కిలీ మ‌ద్యం కేసులు ఉన్నాయి. వీరిలో కాకాని తాను టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌ను బ‌య‌ట పెడ‌తాన‌ని మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే సోమిరెడ్డిపై న‌కిలీ డాక్యుమెంట్లు త‌యారు చేసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఈ విష‌యంలో కాకానిపై సోమిరెడ్డిదే పైచేయి అయ్యింది. ఇక కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి సైతం న‌కిలీ మ‌ద్యం కేసులో చిక్కుకున్నారు. ఆయ‌న టీడీపీలోకి వెళ‌తార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం ఉంది. ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి సైతం త‌న‌పై ఉన్న కేసుల‌ను త‌ప్పించుకునేందుకు పార్టీ మార‌తార‌ని టాక్ ఉంది. మ‌రి రేపో మాపో వీరిద్ద‌రు కూడా పార్టీ మారితే జ‌గ‌న్ ఖాతా నుంచి మ‌రో జిల్లా చేజారిన‌ట్టే అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.