పదవీకాలంలో ఏం చేసినా .ఎలా ఉన్నా అమెరికా అధ్యక్షుల జాబితాలో ఒకరిగా ట్రంప్ మరికొద్దిగంటల్లో మాజీగా మారిపోతున్నారు.ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అధికారాన్ని బదిలీ చేయకుండా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ట్రంప్ చివరి రోజూ కూడా పాత సాంప్రదాయానికి చెక్ పెట్టి… కొత్త వివాదానికి తెరదీశారు.1989 నుంచి వస్తున్న వీడ్కోలు లేఖ సంప్రదాయానికి స్వస్తి పలికారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి, కొద్దిగంటల్లో నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఎలాంటి లేఖ రాయకుండానే ట్రంప్ పదవి నుంచి దిగిపోనున్నారు.కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు లేఖ రాసే సంప్రదాయానికి 1989లో నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ శ్రీకారం చుట్టారు.నాటి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ నిర్విఘ్నంగా కొనసాగింది.2017లో పదవి నుంచి దిగిపోవడానికి ముందు బరాక్ ఒబామా ట్రంప్‌కు లేఖ రాశారు.
కానీ ఇప్పుడు జో బైడెన్ ఎన్నికనే గుర్తించని ట్రంప్ లేఖ రాసే అవకాశాలు కనిపించడం లేదు.విజయానికి కచ్చితమైన నమూనా ఏమీ ఉండదని, ఇక్కడందరూ తాత్కాలికంగా ఉండేవారేనని అప్పట్లో ట్రంప్‌కు రాసిన వీడ్కోలు లేఖలో ఒబామా పేర్కొన్నారు.ప్రజాస్వామ్య సంస్థలు, సంప్రదాయాలకు రక్షకులుగా ఉండాలని బరాక్ తన లేఖలో పేర్కొన్నారు.అయితే, ఇప్పుడు ట్రంప్ మాత్రం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టనున్నట్టు వార్తలు రావడంతో మళ్లీ ఆయనను విమర్శలు చుట్టుముడుతున్నాయి.
అంతేకాకుండా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు పాల్గొనడం సంప్రదాయం.ట్రంప్ దీనిని కూడా పాటించడం లేదు.ఆయనకు బదులుగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.బుధవారం సాయంత్రం లేదా రాత్రికి ట్రంప్ శ్వేతసౌధం వదిలేసి ఫ్లోరిడాలోని తన ఇంటికి వెళ్తున్నారు.కాగా, జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఆయనతో పాటు భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తారు.