టీఆర్‌ఎస్‌కు అనుకున్నంత ఈజీ అయితే కాదు!       2018-06-11   23:45:43  IST  Bhanu C

2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలకు 2019లో జరుగబోతున్న ఎన్నికలకు చాలా ప్రత్యేకత ఉంది. 2014 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు అధికారంను దక్కించుకోగా కేంద్రంలో బీజేపీ సత్తా చాటడంతో మోడీ ప్రధాని అయ్యారు. సహజంగా అయితే రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. గత కొంత కాలంగా చూసుకుంటే ఎక్కువ శాతం రెండు దఫాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మనం చూస్తూ వస్తున్నాం. కాని ప్రస్తుత పరిస్థితి తారు మారు అయ్యేలా అనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ మిత్రులతో కలిసి వచ్చినా కూడా మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవని రాజకీయ పండితులు తేల్చి పారేస్తున్నారు.

-

ఇక తెలంగాణ విషయానికి వస్తే టీఆర్‌ఎస్‌కు కాస్త సానుకూల వాతావరణం ఉంది. అయితే కళ్లు మూసుకుని గెలిచేయవచ్చు అన్నంత ఈజీగా మాత్రం పరిస్థితి లేదు అంటూ రాజకీయ పండితులు చెబుతున్నారు. ఉద్యోగాలు వేస్తానంటూ నిరుద్యోగులను మోసం చేయడంతో పాటు, కొన్ని వర్గాల ప్రజల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడాలి అంటే అంత సులభం ఏమీ కాదు అంటూ విశ్లేషకులు అంటున్నారు. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో, నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలోనే రాబోతున్న ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు పరీక్ష అంటున్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఎన్నో పథకాలు సామాన్యులకు కాకుండా, ఎక్కువగా ఉన్నత శ్రేణి వారికే ఉపయోగదాయకంగా ఉన్నాయంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతు బంధు పతకం తీసుకుంటే అయిదు ఎకరాలకు పైగా ఉన్న వారు భారీగా ఉన్నారు. వారంతా కూడా రైతు బంధు పతకంను వాడుకోవడంతో సామాన్యులు బలి అవుతున్నారు. తక్కువ భూమి ఉన్న వారి కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి వే కోట్లలో ప్రభుత్వ సాయం అందింది. ఇక కౌలు రైతుకు చిల్లి గవ్వ కూడా దక్కలేదు. అందుకే రైతులు మరియు కౌలు రైతులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు.

ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కాని, కొన్ని విషయాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గట్టిగా పోరాడితే టీఆర్‌ఎస్‌కు గతంలో వచ్చిన మెజార్టీ రాకపోవచ్చు అని, ఖచ్చితంగా హంగ్‌ ఏర్పడుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లో ఆ విషయం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని టీఆర్‌ఎస్‌పై కలిసి సమిష్టిగా యుద్దం చేస్తే తప్పేకుండా విజయాన్ని అందుకోవచ్చు. కాని కాంగ్రెస్‌ వారి వర్గ విభేదాలు టీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు నమ్మకంగా ఉన్నారు. బీజేపీ తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపించలేక పోవచ్చు. కోదండరామ్‌ పార్టీకి రెండు మూడు స్థానాల వరకు సాధ్యం అవ్వొచ్చు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.