ఫలితం ఎలా ఉంటుందో స్పష్టత లేనప్పటికీ దుబ్బాక ఉప ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు కాస్త ప్రశాంతంగా ఉన్నాయి.త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఉండడంతో, ఆ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి ? ప్రజలను ఏవిధంగా ఆకట్టుకోవాలి అనే విషయంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి.గ్రేటర్ లో విజేతగా నిలిస్తే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమవైపు ఉంటుందని అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి.అందుకే తమ శక్తిని మొత్తం కూడగట్టుకొని బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, అధికార పార్టీ టిఆర్ఎస్ కు మాత్రం ఎక్కడలేని కంగారు కనిపిస్తోంది.గ్రేటర్ లో కనుక ఫలితాలు తేడా కొడితే, ఆ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై తప్పనిసరిగా పడుతుందని, గ్రేటర్ కనుక చేజారితే, ప్రతిపక్షాలు బలపడి పోతాయని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
మొన్నటి వరకు విజయంపై టిఆర్ఎస్ పార్టీకి ధీమా ఉన్నా, అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలతో, హైదరాబాద్ నగరం మొత్తం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది.ఆ ప్రభావం ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ పై పడింది.
దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.వరద సహాయం సుమారు పదివేల వరకు ఇస్తున్నా, ప్రజల్లో సంతృప్తి కనిపించడం లేదు.
అసలు ఇంతటి పెను విపత్తు సంభవించడానికి కారణం, అధికారపర్టీ నిర్లక్ష్యం అనే విషయాన్ని ప్రతిపక్షాలు జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంతో,ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది.ప్రజలను పరామర్శించేందుకు అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు, వరద సహాయం పంపిణీ చేసేందుకు, జనాల వద్దకు వెళ్తున్న టిఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురవుతుంది.
ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తూ ఉండడంతో,జనంలోకి వెళ్లేందుకు టిఆర్ఎస్ శ్రేణులు వెనకడుగు వేస్తున్నాయి.

ఇంతటి ప్రతికూల వాతావరణం ఉన్న పరిస్థితుల్లో, ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఫలితాలు తేడా కొడతాయి అని టిఆర్ఎస్ నేతలు అంతా ఆందోళనతో ఉన్నారు.అందుకే గ్రేటర్ ఎన్నికలు మరికొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని టిఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నార ట.ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధి లోని అధికార యంత్రాంగం మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉండటం వంటి కారణాలను, ఎప్పుడు టిఆర్ఎస్ శ్రేణులు తెరపైకి తెస్తున్నారు.ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పార్టీలోని కీలక నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించిన సందర్భంగా, దాదాపు అందరూ గ్రేటర్ ఎన్నికలను మరికొద్ది రోజులు పొడిగించాలని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యేలా చూడాలని, ఇప్పుడు ఎన్నికలకు వెళ్లినా, ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో, ఇదే విషయాన్ని కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారట.ప్రస్తుతం ఈ వ్యవహారం కెసిఆర్ కోర్టులో ఉండడంతో, ఆయన దీనిపై నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.