టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ..? నేతల కంగారు ఎందుకు ..?  

తెలంగాణ లో గులాబీ పార్టీ మంచి స్పీడ్ మీద ఉంది. తాను నిద్రపోకుండా నాయకులను నిద్రపోనివ్వకుండా కంగారు పెట్టిస్తున్న గులాబీ బాస్ అన్ని సంచలన నిర్ణయాలే తీసుకుంటూ ప్రత్యర్థి పార్టీలను మరింత కంగారు పెట్టిస్తున్నారు. అయితే కేసీఆర్ దూకుడు నిర్ణయాలు పైకి బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా .. నాయకులకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో అసలుకే ఎసరు వచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు ధీమా మీద కేసీఆర్ ఉంటే ఆ పార్టీ నాయకులు మాత్రం గెలుపు సంగతి తరువాత ముందు పార్టీలో ఉన్న ఇంటి పోరు చక్కదిద్దితే సరిపోతుంది కదా అని చెప్తున్నారు.

TRS Leader Tension With Kcr Announcement-

TRS Leader Tension With Kcr Announcement

టీఆర్ఎస్ లో సిట్టింగులందరికీ టిక్కట్లు ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. కాని కొందరికి మాత్రం ఇవ్వలేం అని ప్రకటించారు. దీంతో సిట్టింగుల్లో ఆందోళన ప్రారంభమైంది. టిక్కట్టు రాదు అనుకున్ననాయకులంతా తమ నియోజకవర్గాల్లో టిక్కట్లు దక్కే అవకాశాలు ఉన్నది ఎవరికా అని ఆరా తీయడం ప్రారంభించారు. అంతే కాదు తమ గురించి అధిష్టానం ముఖ్యంగా పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు మనసులో ఏముందో తెలుసుకునే పనిలో పడ్డారు. తమకు టిక్కట్లు ఇస్తే ఓడిపోతారంటూ అధిష్టానం వద్దకు వస్తున్న ఫిర్యాదులతో వారు ఆందోళన చెందుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు.

సిట్టింగ్ లు అందరికి సీటు ఖాయం అని ప్రకటన చేసిన కేసీఆర్ ఆ తరువాత నియోజకవర్గాల్లో కింది స్థాయి నాయకత్వానికి బాగా ప్రాధాన్యం ఇస్తూ వారిని ప్రోత్సహిస్తుండడం వీరికి నచ్చడంలేదు. కొందరైతే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్టీలో పెరుగుతున్న ఇంటిపోరుతో ఎన్నికల్లో గెలుపు కష్టమేనని వారంటున్నారు. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు ఈ సారి టిక్కట్టు తమదేనని వచ్చే నెలలోనే తమ పేర్లను ప్రకటిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. పోనీ ఈ వ్యవహారాలపై బహిరంగంగా స్పందిద్దామా అంటే అంత సాహసం చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో వారిలో వారే ఆందోళన పడిపోతున్నారు.