సాధారణ ఎన్నికల్లోనూ కనిపించనంత టెన్షన్ హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో అన్ని పార్టీల్లో నూ కనిపిస్తోంది.ఎలాగైనా గెలవాలని కసి, పట్టుదల అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది ముఖ్యంగా బీజేపీ , టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ గెలుపు పై నమ్మకం పెట్టుకున్నాయి.
టిఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇక్కడ అభ్యర్థి కావడంతో టీఆర్ఎస్ సీరియస్ గా హుజూరాబాద్ నియోజకవర్గం పై దృష్టి పెట్టింది.సీఎం కేసీఆర్ తో పాటు మిగిలిన మంత్రులు , ఎమ్మెల్యేలు అందరూ హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ గెలుపుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
తమ రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం లేకుండా చేయాలంటే ఆయన పార్టీలో ఉన్న అసంతృప్త బలమైన నేతలను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం ఒక్కటే మార్గంగా ఆపార్టీ నమ్ముతోంది.
అందుకే ప్రాధాన్యం గల నాయకులందరినీ, తమ వైపు తిప్పుకునే పనిలో ఉంది.
ఇటీవలే తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టిఆర్ఎస్ లో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
బిసి సామాజిక వర్గానికి చెందిన ఆయన చేరిక వల్ల హుజూరాబాద్ లో పట్టు దక్కుతుంది అని టిఆర్ఎస్ నమ్ముతోంది.అలాగే కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న యువ నాయకుడు కౌశిక్ రెడ్డి ని కాంగ్రెస్ క దూరం చేయగలిగింది .కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరేందుకు, టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 16న హైదరాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో రమణ అధికారికంగా పార్టీలో చేరబోతున్నారు.
ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు .ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులతో కెసిఆర్ భేటీ కాబోతున్నారు.
కౌశిక్ రెడ్డి సైతం భారీ అనుచరగణంతో తెలంగాణ భవన్ కు వెళ్లి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.వీరే కాకుండా నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపించగల నాయకులందరినీ టిఆర్ఎస్ లో చేర్చుకునే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.