'కమలం'తో 'కారు' ప్రయాణం ..? ఇదే జరగబోతోందా ..?       2018-06-16   04:19:46  IST  Bhanu C

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ముమ్మాటికీ నిజం. నిన్నటి వారకు తిట్టుకున్నా.. ఈ రోజు చేయి చేయి కలిపి దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకుంటూ కలిసి ప్రయాణం చేస్తుంటారు. తాజాగా ఇప్పుడు జరగబోతున్నది కూడా అదే. కేంద్ర అధికార పార్టీ బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి హస్తిన వేదిక కాబోతోంది. ఈ డీల్ కుదిరితే కేసీఆర్ కుమార్తె కవిత కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం వరకు బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్ ఈ మధ్యకాలంలో మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు. ఎందుకో తెలియదు కానీ ..వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ ప్రస్తుతం ఆ ఊసే తీయడం లేదు. ప్రస్తుతం కేసీఆర్ వ్యవహారశైలి మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కేసీఆర్ అనేక బహిరంగ సభల్లో మోడీని ఏకవచనంతో “డు” అని కూడా సంభోదించి సంచలనం సృష్టించారు. అటువంటి వ్యక్తి మూడు నెలల నుంచి దాదాపుగా సైలెంట్ గా ఉంటున్నారు. దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని ఎవరికీ వారు ఊహాగానాలకు తెరలేపారు.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు విపక్ష డిఎంకె నేతలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ అనే ప్రకటన చేశారు. కర్ణాటక ఎన్నికల్లో జనతాదళ్ కు మద్దతు ప్రకటించి వచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోయినా, ముందు రోజే వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు

అప్పటి నుంచి జరుగుతుంది ఏంటి..? అసలు బిజెపిని ఎందుకు విమర్శించడం లేదు..? రాష్ట్ర బిజెపి నాయకులు కూడా తెరాస ప్రభుత్వంపై ఆరోపణల తీవ్రత ఎందుకు తగ్గించారు? తెరవెనుక ఏమి జరుగుతుంది అనే విషయం ప్రజలకే కాకుండా ఆయా పార్టీల కార్యకర్తలకి కూడా అర్ధం కావడంలేదు.

నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల సమావేశం పదహారో తేదీన జరగబోతున్న సమయంలో… ప్రధాని కార్యాలయం హఠాత్తుగా కేసీఆర్‌కు పదిహేనో తేదీ మధ్యాహ్నం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది.ప్రధానమంత్రి ఆపాయింట్‌మెంట్ ఖరారు కాగానే కేసీఆర్ ముందుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. గవర్నర్ నరసింహన్‌తో సమావేశయ్యారు. తెలుగు రాష్ట్రాల పరిస్థితులపై గవర్నర్ తన నివేదిక మోదీకి అందించిన నేపథ్యంలో కేసీఆర్ కు పిలుపురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కెసిఆర్ ఎన్డియేలో చేరతారా లేక రాష్ట్రంలో తెరాస తో బిజెపి పొత్తు పెట్టుకుంటుందా..? ఒకవేళ ఎన్డిఎలో తెరాస చేరితే ఎంపి కవితకు గాని గుత్తా సుఖేందర్ రెడ్డికి గాని కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు కేంద్రమంత్రులెవరూ లేరు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేసే యోచనలో నరేంద్రమోదీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక ఎన్నికల్లో జెడిఎస్ కి మద్దతు ఇచ్చిన కెసిఆర్ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి మాత్రం హాజరు కాలేదు. కొద్ది రోజుల నుంచి బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో పాత మిత్రులను కలుపుకుపోయే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ కి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.