అది ఎక్కువగా తాగితే వినికిడి సమస్యలు వస్తాయి  

కాఫీ చాలామందికి ఫేవరేట్. ఉదయం లేస్తూనే కాఫీ శరీరంలో పడకపోతే బద్ధంగా ఉంటుంది. ఏదో కోల్పోయినట్లుగా, అస్తవ్యస్తంగా అనిపిస్తుంటుంది. కాఫీ లో ఉండే మత్తు, గమ్మత్తే అది. కాని కాఫీ లిమిట్ లో తాగాలని, అలవాటు హద్దు మీరితే ఎన్నో ఆరోగ్య ససమస్యలు వస్తాయని మనం ఇప్పటికీ చాలాసార్లు చదువుకున్నాం. సరికొత్తగా, కెనెడాలో జరగిన ఒక పరిశోధనలో ఎక్కువ కాఫీ తాగడం వలన వచ్చే మరో సమస్య బయటపడింది.

మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా గట్టిశబ్దం చాలా దగ్గరగా విన్న తరువాత మన చెవి కోలుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాసేపు ఏది సరిగా వినలేకపోతాం. చెవుడు వచ్చిందేమో అన్నంత భయం కూడా వేస్తుంది. కాని కొంత సమయం తీసుకున్నాక చెవులు మళ్ళీ కోలుకుంటాయి. మళ్ళీ అన్ని సరిగా వినబడతాయి. ఇలా మన చెవులు వాటికి అవే కోలుకోవడం చాలా సహజమైన క్రియ. అయితే కాఫీ ఎక్కువ తాగే వారు చెవులు కోలుకునే శక్తిని తమకు తెలియకుండానే దెబ్బతీసుకుంటున్నారట.

కెనడాలోని మెక్ గిల్ యూనివర్శిటీ పరిశోధకులకు ఈ ఆసక్తికరమైన విషయం తెలిసివచ్చింది. కాఫీలో ఉండే కెఫైన్ మన వినికిడి శక్తిపై చాలా ప్రభావం చూపుతుందట. మితిమీరిన కాఫీ తాగడం వలన వినికిడి శక్తి దెబ్బతినడమే కాదు, ఏదైన అనుకోని సంఘటనకు, పెద్ద శబ్దానికి చెవి ఎదురు వెళితే కోలుకోవడం కష్టమని, వినికిడి శక్తిని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్ ఫైజల్ జవావి తెలిపారు.

కాబట్టి కాఫీ ఎక్కువ తాగడం తగ్గించండి. ఇక మితిమీరిన కాఫీ వదిలేయలేని వారు, రాక్ మ్యూజిక్ షోలకి వెళ్ళడం, ప్రాంగణమంతా దద్దరిల్లిపోయేటట్లు లౌడ్ స్పీకర్ లో సంగీతాన్ని వినడం మానేస్తే మంచిది.