వైకాపాలోకి మ‌రో టాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌   Character Artist Hema To Join YSRCP     2017-01-06   03:51:56  IST  Bhanu C

టాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ‌.. వైకాపాలోకి జంప్ చేస్తున్న‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. 2014లోనే పొలిటిక‌ల్‌గా ఎంట్రీ ఇచ్చిన హేమ అప్ప‌ట్లో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై స‌మాక్యాంధ్ర పార్టీలో చేరింది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన హేమ‌.. మండ‌పేట నుంచి అసెంబ్లీ టికెట్ సాధించి అప్ప‌ట్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. అయితే, చంద్ర‌బాబు హ‌వా నేప‌థ్యంలో టీడీపీ దెబ్బ‌కి హేమకి డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి ఆమె వెండితెర‌కే ప‌రిమిత‌మైపోయింది.

అయితే, ఆమె పొలిటీషియ‌న్ అని అనిపించుకోవాల‌నే కోరిక మాత్రం పోలేదు. అంతేకాదు, అసెంబ్లీలో నిల‌బ‌డి అధ్య‌క్షా అని అనాల‌న్న క‌ల‌ల‌ను కూడా విడిచిపెట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల్లో అయినా గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంద‌ట హేమ‌. ఈ క్ర‌మంలోనే ఆమె వైకాపాలోకి జంప్ చేయాల‌ని, ఇప్ప‌టికే అక్క‌డ అన్నీ మాట్లాడేయ‌డం కూడా అయిపోయింద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న హేమ‌.. ఒక్క‌సారిగా కాపు రిజ‌ర్వేష‌న్ ప‌ల్ల‌వి అందుకుంది.

అంతేకాదు, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేలా.. త‌న సొంత సామాజిక వ‌ర్గం కాపుల‌కు చంద్ర‌బాబు అన్యాయం చేస్తున్నార‌ని, ఇచ్చిన హామీని నిలుపుకోలేక పోతున్నార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తింది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అనేది ఇప్ప‌టి విష‌యం కాద‌ని, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఏరికోరి ఇచ్చిన హామీనేన‌ని పేర్కొన్న హేమ‌.. త‌క్ష‌ణ‌మే ఆ హామీని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేసింది.

కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం కాపులు పోరాటం చేయ‌క వేరే వాళ్లు చేస్తారా? అంటూ ప్ర‌శ్న‌లు కూడా గుప్పించింది. సో.. దీంతో ఇప్పుడు నిజంగానే ఆమె వైకాపాలోకి జంప్ చేస్తే.. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ అయిన రోజాకు ఈమె ఖ‌చ్చితంగా తోడ‌వుతుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు!