యాదాద్రి భువనగిరి జిల్లా:నేడు ప్రపంచ టైలరింగ్ డే నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో టైలరింగ్( Tailoring ) పై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 100కు పైగా కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయని వృత్తి దారులు ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నో ఏళ్లుగా టైలరింగే వృత్తిగా జీవిస్తున్న 100 పైగా దర్జీ కుటుంబాలు సరైన ప్రోత్సాహకాలు అందక దర్జాను కోల్పోయి దుర్భరంగా మారాయని వాపోయారు.
ఆధునిక జీవనశైలిలో ఫ్యాషన్ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్ ప్రపంచం,ఆన్లైన్ షాపింగ్ విధానం రావడంతో దర్జీలు గిరాకీలు లేక ఆర్థికాభివృద్ధికి దూరమై, ఏళ్ల తరబడి తమహక్కుల కోసం,ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని,టైలర్స్ తో పాటు అదే వృత్తికి అనుబంధ కార్మికులు, మహిళలు అనేక అవస్ధలు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని అంటున్నారు.
నాయకులు అధికారులు,అత్యున్నత హోదాలో ఉన్నవారిని హుందాగా,అందంగా తీర్చిదిద్దే కళా నైపుణ్యం గల తమను పూర్తిగా విస్మరించారని,ఈ ప్రభుత్వమైనా చొరవచూపి సబ్సిడీ( Subsidy )లపై మెటీరియల్స్, కుట్టు మిషన్స్,50 ఏండ్లకే పెన్షన్స్ అందించి,విద్యా, వైద్య రాయితీలు కల్పించే దిశగా ఆలోచన చేయాలని కోరారు.