సాధారణంగా ప్రజలు వివిధ మతాలకు చెందిన వారైనప్పటికీ, వారి జీవితం బాగుండాలని ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా సాగిపోవాలని కనిపించిన దేవుడికి నమస్కరించుకుంటారు.ఈ క్రమంలోనే ఎన్నో హిందూ దేవాలయాలలో హిందువులు ముస్లింలు ఏకమై దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.
అలాంటి దేవాలయాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన కడప వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి.ఈ ఆలయంలో హిందువులు మాదిరిగానే ముస్లింలు పెద్ద ఎత్తున స్వామివారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలను కొడుతూ మొక్కులు తీర్చుకుంటారు.
కడపలో ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలకు తొలి గడపగా ఎంతో ప్రసిద్ధి చెందింది.దక్షిణ భారతీయులు కాశీకి వెళ్లేవారు, ఉత్తరభారతీయులు రామేశ్వరానికి వెళ్లేవారు, కాలినడకన తిరుమలకు చేరుకునేవారు తప్పకుండా మొదట శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు.
దేవుని గడప అనే పదాల నుంచి ఉద్భవించిన గడపా అనే పదానికి కడప అని పేరు పెట్టారు, దీని అర్థం “ వెంకటేశ్వర స్వామి ప్రవేశద్వారం“.ఉగాది పండుగ రోజు ప్రతి ఆలయంలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఉగాది పండుగ రోజు ముస్లింలు పెద్ద ఎత్తున ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం విశేషం.వెంకటేశ్వర స్వామి బిబి నాంచారిని పెళ్లి చేసుకోవడం వల్ల ముస్లింలు వెంకటేశ్వరస్వామిని తమ అల్లుడిగా భావించి పూజిస్తారు.దేవుని గడపగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు.