చదువు మానేయమన్న తండ్రికి..ఆ ముగ్గురు అక్కాచెల్లెల్లు ఎలా బుద్ది చెప్పారో తెలుసా.?     2018-07-19   09:31:26  IST  Sai Mallula

పూర్వం ఒక‌ప్ప‌టి కాలంలో స‌మాజంలో స్త్రీల ప‌ట్ల వివ‌క్ష ఏ విధంగా ఉండేదో అంద‌రికీ తెలిసిందే. వారిని వంట ఇంటి కుందేళ్లుగా చూసేవారు. ఆడ‌వారంటే వారిని కేవ‌లం ఇంటికే ప‌రిమితం చేసేవారు. పని చేయ‌డం కోసం కాదు క‌దా, క‌నీసం బ‌య‌ట‌కు అడుగు కూడా పెట్ట‌నిచ్చేవారు కాదు. అలాంటి దుర్భర ప‌రిస్థితిని స్త్రీలు ఒక‌ప్పుడు ఎదుర్కొన్నారు. కానీ నేటి త‌రుణంలో అలా కాదు. త‌మ‌కు ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా వారు ధైర్యంగా ముంద‌డుగు వేస్తున్నారు. ఇక వివ‌క్షాపూరిత‌మైన చ‌ర్య‌లు, ధోర‌ణిని వారు ఎంత మాత్రం స‌హించ‌డం లేదు. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబంలోని ఆ ముగ్గురు బాలిక‌లు కూడా స‌రిగ్గా ఇదే చేశారు. చ‌దివింది చాలు, ఇక వంట ప‌ని, ఇంటి ప‌ని చేసుకోండ‌ని తల్లిదండ్రులు చెప్పిన మాట‌కు వారు ఎదురు తిరిగారు. దీంతో వారు తాము అనుకున్న‌ది సాధించారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

Three Sisters For Education-

Three Sisters For Education

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఇందిరాన‌గ‌ర్ అనే ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంలో ముగ్గురు బాలిక‌లు ఉన్నారు. వారిలో ఒక‌రికి 16 ఏళ్లు ఉంటాయి. మ‌రో ఇద్ద‌రికి 14, 13 ఏళ్లు ఉంటాయి. అయితే వారిలో పెద్ద అమ్మాయిని తండ్రి చ‌దువు మానేయ‌మ‌ని చెప్పాడు. ఇంట్లో ఉండి ఇంటి ప‌ని, వంట ప‌ని చేసుకుంటూ నాలుగిళ్ల‌లో ప‌నిచేస్తే కుటుంబానికి ఆస‌ర‌గా ఉంటుంద‌ని చెప్పాడు. దీంతో తండ్రి చెప్పిన ఆ మాట పెద్ద అమ్మాయికి న‌చ్చ‌లేదు. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అక్క అలా బ‌య‌ట‌కు వెళ్లే స‌రికి ఇద్ద‌రు చెల్లెళ్లు ఇంట్లో ఉండ‌లేక‌పోయారు. వారు కూడా ఆమెతోపాటు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

అలా ముగ్గురు అక్క చెల్లెళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చాక త‌మ వ‌ద్ద ఉన్న సైకిల్‌ను ఖ‌ర్చుల కోసం అమ్మేశారు. అనంత‌రం అక్క‌డికి ద‌గ్గ‌ర్లోని సీతాపూర్ వెళ్లారు. అక్క‌డి నుంచి షాజ‌హాన్ పూర్‌, ల‌ఖీం పూర్ కు వెళ్లారు. అక్క‌డే ల‌క్నో ట్రెయిన్ ఎక్కారు. అప్ప‌టికే రెండు మూడు రోజులు కావ‌డంతో మ‌రోవైపు వారి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దీంతో పోలీసుల‌కు ఆ ముగ్గురు ల‌క్నోలో దొరికారు. దీంతో ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ల‌ను వారి త‌ల్లిదండ్రుల‌కు పోలీసులు అప్ప‌గించారు. అయితే పోలీసులు తండ్రికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో తండ్రి త‌న ముగ్గురు కూతుళ్ల‌ను బాగా చ‌దివిస్తాన‌ని ఇంకెప్పుడూ అలా అన‌న‌ని ప్ర‌తిజ్ఞ చేశాడు. ఈ క్ర‌మంలో ఆ ముగ్గురు అక్క చెల్లెళ్లు తాము అనుకున్న‌ది సాధించారు. ఎట్ట‌కేల‌కు వారు ఎంచ‌క్కా చ‌దువుకోనున్నారు. ఏది ఏమైనా ఇలాంటి డేరింగ్ ప‌ని చేసి మ‌ళ్లీ చ‌దువుకునేందుకు సిద్ధ‌మైన వారి ప్ర‌య‌త్నాన్ని అంద‌రం అభినందించాల్సిందే క‌దా..!