తెలంగాణ బిజెపి( Telangana BJP )లో అసంతృప్తి నేతలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.పార్టీలో కీలక నాయకులుగా ఉన్న చాలామందికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, తమను పక్కన పెట్టడంపై చాలా కాలంగా అసంతృప్తితోనే ఉంటున్నారు.
అనేకసార్లు రహస్య సమావేశాలు నిర్వహించారు.ఈ వ్యవహారం తెలంగాణ బీజేపీలో పెద్ద కలకలమే రేపింది.
తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభకు ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) హాజరయ్యారు.అయితే ఆ సభకు చాలామంది సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు.
పాలమూరులోనే నిర్వహించిన ఈ సభకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి సైతం హాజరు కాలేదు.

అలాగే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికి అక్కడ నుంచి ఆయన వెనుతిరిగారు. పాలమూరు సభకు ఆయన హాజరు కాలేదు.ఆయనతోపాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వారు ఈ సభకు హాజరు కాలేదు.
దీంతో వీరు సభకు రాకపోవడానికి కారణాలేమిటి అనేది తెలంగాణ బిజెపిలో హాట్ టాపిక్ గా మారింది.ఇప్పుడు ప్రధాని సభకు గైర్హాజరైన వారంతా ఇటీవల కాలంలో రహస్య సమావేశాలు నిర్వహించిన నేతలే కావడం సంచలనంగా మారింది.
అయితే పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో చాలా కాలంగా అసంతృప్తితో ఉంటున్న వీరు బిజెపి అగ్ర నేతల వద్దే తేల్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నా, వారి అపాయింట్మెంట్ దొరకడం లేదు.ప్రధాని పాలమూరు సభ సందర్భంగా ఆయనను కలుద్దామని భావించినా, ప్రధాని షెడ్యూల్ లో నేతలతో ఎటువంటి భేటీ లేకపోవడం వారు సభకు హాజరు కాకపోవడానికి కారణమని తెలుస్తోంది.

ఈనెల మూడో తేదీన నిజామాబాద్ లో ప్రధాని సభ ఉంది.అక్కడ కలిసేందుకు అసంతృప్తి నేతలు అంతా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే వారికి ప్రధాని సమయం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.ఒకవేళ ప్రధాని నరేంద్ర మోది అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తే ఈనెల ఆరో తేదీన తెలంగాణకు వస్తున్న జేపీ నడ్డా ను కలిసి తమ ఇబ్బందులు గురించి చెప్పుకోవాలని భావిస్తున్నారట.
విజయశాంతి ఇటీవల హైదరాబాద్ లో కాంగ్రెస్ నిర్వహించిన సిడబ్ల్యుసి సమావేశాలు సందర్భంగా రాహుల్ గాంధీ( Rahul Gandhi ) చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.తెలంగాణ ఇచ్చింది సోనియా అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ వ్యవహారాలు తెలంగాణ బిజెపి నేతలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి .ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బిజెపిలో అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది .ఆయన కూడా పార్టీ మారాలని తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.