అగ్ర రాజ్యం అమెరికాను కరోనా, ఇతరాత్రా ప్రకృతి విలయాలు కొంత కాలం మాత్రమే పట్టి పీడిస్తాయి కానీ నిత్యం అమెరికన్స్ ను వేధిస్తూ, భయాందోళనలకు గురిచేస్తున్న మరొక భయంకరమైన మహమ్మారి ఉంది అదే గన్ కల్చర్.ఏ రోజు ఎప్పుడు ఎక్కడ తూటాల చప్పుళ్ళు వినాల్సి వస్తుందో, తాము వెళ్ళే ప్రాంతంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయోనని అమెరికన్స్ ఆందోళన చెందని రోజు ఉండదు.
అమెరికా వ్యాప్తంగా ప్రతీ రోజు ఏదో ఒక మూల తుపాకి పేలిన ఘటనలు స్థానికంగా వెల్లడవుతూనే ఉంటాయి.
ఈ గన్ కల్చర్ పై ప్రభుత్వం నిషేధం విధించాలని ఎంత మంది సామాజిక వేత్తలు,స్వచ్చంద సంస్థలు ప్రయత్నాలు చేసినా అవి నిరుపయోగంగానే మారాయి.
బళ్లపై కూరగాయలు అమ్మినట్టుగా అక్కడ తుపాకులు అమ్మేస్తారంటే ఏ స్థాయిలో గన్ కల్చర్ పేరుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు.స్కూలుకు వెళ్ళే పిల్లల దగ్గర నుంచీ అడుక్కుతినే వాడి వరకూ గన్ లు పెట్టుకుని తిరిగే సంస్కృతీ అక్కడ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూనే ఉంటుంది.
ఎంతో మంది అమాయకులు ప్రతీ రోజు గన్ కల్చర్ కు బలై పోతూనే ఉంటారు.తాజాగా అమెరికాలోని అలబామాలో బర్మింగ్ హమ్ లో దుండగులు రెచ్చిపోయారు.
బర్మింగ్ హమ్ లో ఓ సర్వీస్ స్టేషన్ లోకి ఓ దుండగుడు ప్రవేశించాడు.అతడితో పాటు కొందరు దుండగులు కూడా ఆయుధాలతో స్టోర్ లోకి వచ్చారు.
వచ్చీరాగానే ఆ స్టోర్ లో క్లర్క్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఏపీ విశాఖపట్నం కి చెందిన చిట్టూరి సత్య కృష్ణపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.దాంతో అక్కడికక్కడే సత్య కృష్ణ కుప్ప కూలిపోయారు.
హుటాహిటిన ఆసుపత్రికి తరలించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని సంఘటన జరిగిన ప్రాంతంలోనే సత్య కృష్ణ మృతి చెందారని తోటి ఉద్యోగులు పేర్కొన్నారు.ఉన్నత విద్య చదువుకోవాలని అమెరికాకు అప్పు చేసి మరీ వచ్చారని , పెళ్లి అయ్యి ఏడాది అయ్యిందని అతడి భార్య ప్రస్తుతం గర్భవతని సత్య కృష్ణ సన్నిహితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
స్థానికంగా ఉన్న పోలీసులు కేసును నమోదు చేసుకుని సిసిటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి దర్యాప్తు చేపట్టారు.