టీడీపీ కాంగ్రెస్ దోస్తీ వర్కవుట్ అవుతుందా ..?     2018-09-19   11:01:08  IST  Sai M

తెలంగాణ ముందస్తు ఎన్నికల రేసులో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి పార్టీల కంటే ముందుంది . సాధారణ ప్రజలు కూడా ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఒకటి రెండు సర్వేల్లోనూ ఇదే విషయం తేలింది. సుమారు సగం ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉన్నారని, సగం మంది కేసీఆర్ పాలన బాగుందని అన్నట్లు తేలింది. ప్రతిపక్షాలు బలపడక ముందే ఎన్నికలకు వెళ్లి సులువుగా విజయం సాధించాలనేది కేసీఆర్ ఆలోచన. అయితే కేసీఆర్ ప్లాన్ పసిగట్టిన విపక్షాలు ఆయన దూకుడుకి అడ్డుకట్ట వేసేందుకు మహా కూటమిగా ఏర్పడ్డాయి. అదీకాకుండా… ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చుకుంటే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీలు గుర్తించాయి.

కేసీఆర్ బలంపై స్పష్టమైన అంచనా ఉన్న ప్రతిపక్షాలకు కేసీఆర్ ను గద్దె దించాలంటే మహాకూటమి ఏర్పాటే ఏకైక మార్గమనే నిర్ణయానికి వచ్చాయి. ఈ కూటమికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉండనుంది. ఇక తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలు కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే, అన్ని పార్టీల విషయంలో లేని చర్చ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు అంటే మాత్రం అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాలు గెలిచింది. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, హైదరాబాద్ శివారు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇక జిల్లాల్లో కొన్ని స్థానాలు గెలిచినా పార్టీల బలం కంటే అక్కడ అభ్యర్థుల వ్యక్తిగత బలమే ప్రధానంగా పనిచేసింది. అయితే, హైదరాబాద్ లో సీమాంధ్రుల ఓటర్లు గత ఎన్నికల్లో ఎక్కువ శాతం టీడీపీ ఓటేశారు. ఇక నరేంద్ర మోదీ ప్రభావం కూడా బాగానే పనిచేసింది. మరి, ఈ ఎన్నికల్లో పరిస్థితి అలా ఉందా అనేది చెప్పలేం. సీమాంధ్ర ఓటర్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు నిలిచారు. కానీ, కాంగ్రెస్‌, టీడీపీ మాత్రం ఇంకా గత ఎన్నికల్లో టీడీపీకి ఓటేసిన వారంతా మళ్లీ వేస్తారని భావిస్తున్నారు. టీడీపీ కూడా అదే దృష్టిలో పెట్టుకుని పెత్తులో 30 స్థానాలు అడుగుతున్నారు.

The TDP and Congress Friendship Will Work In Telangana Elections-Party Tie Ups,TDP,TDP And Congress Friendship,Telangana Elections,The TDP And Congress Friendship Will Work In Telangana Elections,Uninted Parties In Telangana

హైదరాబాద్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కసీటు గెలవలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. అందుకే టీడీపీతో కలిసి పోటీ చేసి రెండు పార్టీల ఓట్లు ఒక్కచోట చేరితే ఈ ఎన్నికల్లోనైనా మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక పొత్తుల వల్ల టీడీపీకి వదిలే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అసంతృప్తికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇక సీమాంధ్ర ఓటర్లు ఏమైనా అనుకూలంగా మారినా తెలంగాణ ప్రాంత ఓటర్లలో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. టీడీపీ సమైక్యవాదాన్ని ఎత్తుకుందని, ఆంధ్రా పార్టీ అని కూడా ప్రజలు భావించే అవకాశం ఎంతో కొంత ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఈ దిశగా ప్రచారం కూడా భారీగానే మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో మహా కూటమి ప్లాన్ వర్కవుట్ అవుతుందా అనేది పెద్ద సందేహంగా ఉంది.