క్రికెట్ ధ్యాసలో పడి పక్కింట్లో ఇవ్వాల్సిన కుంకుమ మర్చిపోయాడు కిరణ్..! తర్వాత తెలివిగా ఏం చేసాడో తెలుసా.?  

The Importance Of Childhood Friendships-

కె. కిరణ్ కుమార్ (సెక్షన్ బి 8వ తరగతి ) కి వచ్చినంత కష్టం ఆ కాలంలో ఎవరికీ వచ్చి ఉండదు. అసలీ కష్టమంతా పక్కింటి గురునామ్ సింగ్ వల్లనే వచ్చింది.తండ్రి పది రోజుల క్రితం వ్యాపార నిమిత్తం వెళ్ళాడు.

వెళ్లే ముందు పక్కింటి గురునాం సింగ్ ఆయన్ని కలుసుకుని, “భయ్యా! స్వర్ణదేవాలయం పక్క సందులో కుడి వైపు బజారులో ‘పవిత్ర సింధూర్’ అని దొరుకుతుంది. అదొక్క ప్యాకెట్టు తీసుకురా” అని కోరాడు. తండ్రి వస్తూ వస్తూ ఒక ప్యాకెట్ కుంకుమ తీసుకొచ్చి కొడుక్కిచ్చి పక్కింట్లో ఇచ్చి రమ్మన్నాడు.

అది క్రికెట్టు ఆడే సమయం. క్రికెట్టు కంటే ముఖ్యమైనది మరొకటి ఉండదు కదా! ఆ తొందరలో కిరణ్ దాన్ని ఎక్కడో పెట్టి ఆటకి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి జ్ఞాపకం వచ్చి ఇద్దామనుకుంటే, ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. అప్పట్నుంచి మొదలయింది దిగులు.

చదువు ఎక్కదు.

నిద్ర పట్టదు.

నిద్రలో తండ్రి తన వీపు మీద కుంకుమవర్ణం తేలేట్టు కొడుతున్న కల కూడా వచ్చింది. ఇంత అల్పప్రాణికి ఎంత పెద్ద సమస్య?అంతలో ఒక ఆలోచన. అది రాగానే కిరణ్ మొహం విప్పారింది.

రీడర్స్ డైజెస్ట్ దగ్గరనుంచి అప్పుడప్పుడు అలాంటి ఉత్తరాలు రావటం చూసాడు. తెలియని మనిషికి స్నేహపూరిత ఉత్తరాలు వ్రాస్తారు వాళ్ళు. ఒక కార్డు తీసుకుని వెంటనే ఉత్తరం వ్రాసాడు .

క్రికెట్ ధ్యాసలో పడి పక్కింట్లో ఇవ్వాల్సిన కుంకుమ మర్చిపోయాడు కిరణ్..! తర్వాత తెలివిగా ఏం చేసాడో తెలుసా.?-The Importance Of Childhood Friendships

డియర్ ఫ్రెండ్,

నువ్వెవరో నాకు తెలియదు. నువ్వూ నాలాగే ఎనిమిదో తరగతి కదా! అందుకని వ్రాస్తున్నాను. నా పేరు కిరణ్. మా నాన్నగారు మీ ఊరినుంచి వస్తూ వస్తూ మా పక్కింటాయన కోసం పవిత్ర సిందూర్ తెచ్చారు.

నేను క్రికెట్టు ఆటకి వెళ్లే తొందరలో దాన్ని ఎక్కడో పెట్టాను మిత్రమా! ఒక్క సింధూర్ ప్యాకెట్ నాకు వెంటనే పోస్టులో పంపగలవా? అది స్వర్ణదేవాలయం పక్కసందులో దొరుకుతుందట. కిరణ్.

కార్డు మీద ‘సింగ్, రోల్ నెం. 1, ఎనిమిదో తరగతి, హైస్కూల్, టెంపుల్ రోడ్, అమృతసర్’ అని వ్రాసి పోస్ట్ చేసాడు. టెంపుల్ రోడ్ లో స్కూల్ ఉందో లేదో తెలీదు.

అమృతసర్ లో చాలామందికి ‘సింగ్’ అన్నపేరు చివర్లో ఉంటుందని మాత్రం తెలుసు.

వ్రాసి పోస్టు చేశాక అతడికి అనుమానం వచ్చింది. రోల్ నెం.1 లో సింగే ఉంటాడని నమ్మకం ఏంటి? తనలాగే ఏ కుమారో, రావో ఉండచ్చుగా!

మధ్యానికల్లా అనుమానం ఎక్కువైంది. భోజనానికి ఇంటికొచ్చినప్పుడు కిడ్డీ బ్యాంకులో చూసాడు.

పదిహేను రూపాయలు దాకా వుంది. పోస్టాఫీసులో వంద కార్డులు తీసుకున్నాడు. మధ్యానమంతా ప్లే గ్రౌండులో కూర్చుని అదే ఉత్తరాన్ని వంద కార్డుల మీద వ్రాసాడు.

ఆరోతరగతి నుండి పదో తరగతివరకూ క్లాసులు వ్రాసి, ఇష్టం వచ్చిన నెంబర్లు వేసి, అన్నిటి మీద సింగ్ అన్న పేరు వ్రాసి పోస్ట్ చేసాడు. అతడు అన్ని కార్డులు వ్రాయడానికి కారణం వుంది. ఉత్తరం అందినా ఆ అబ్బాయి షాపు వరకూ వెళ్లి సిందూర్ కొనేంత శ్రమ తీసుకుంటాడని నమ్మకం ఏమిటి? ఒకవేళ కొన్నా పంపటానికి పోస్టు ఖర్చులుండద్దూఅన్నిటికన్నా ముఖ్యంగా ముక్కూ మొహం తెలియని వ్యక్తి కోసం కష్టపడే జాలిగుండె ఉండాలి.

ఈ అనుమానాలతోనే ఆదివారం దగ్గర పడే కొద్దీ గుండెలు భయంతో బరువెక్కసాగాయి. ఆ రోజు మధ్యాహ్నం లెక్కల టీచర్ పాఠం చెప్తుండగా పోస్ట్-మ్యాన్ వచ్చి ‘కిరణ్ కుమార్ కి రిజిస్టర్ కవర్’ అన్నాడు. టీచర్తో సహా క్లాసులో అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా కిరణ్ వెళ్లి సంతకం చేసి తీసుకుని విప్పాడు. దాంట్లో చిన్న ప్లాస్టిక్ కవర్లో కుంకుమ, ఉత్తరము ఉన్నాయి.

డియర్ కుమార్, మా తాతగారు ఒకసారి మీవైపు వచ్చారట. మీరు మాలాగా గోధుమ రొట్టెలు తినరటగా! ఈ ఉత్తరం అందగానే జవాబు వ్రాయి. నీ గురించి, నీ స్నేహితుల గురించి, మీ ప్రాంతం గురించి వ్రాస్తావు కదూ! మీ రాష్ట్ర ముఖ్యపట్టణం హైద్రాబాదులో పెద్ద మ్యూజియం ఉందట కదూ! మొన్నే మా టీచర్ చెప్పింది.

నీ స్నేహితుడు, సంజయ్ సింగ్.

హుషారుగా ఆ ప్యాకెట్ పట్టుకుని ఇంటికి వెళ్లి పక్కింటాయనకు ఇచ్చేసాడు. ఆ సాయంత్రమే సింగ్ కి తన కృతజ్ఞతలు చెపుతూ ఉత్తరం వ్రాసాడు.

ఆ మరుసటి రోజు లెక్కల క్లాసు జరుగుతుండగా మళ్ళీ పోస్టుమాను వచ్చాడు.

ఈ సారి నాలుగు కవర్లు వచ్చినాయి. వేర్వేరు క్లాసుల నుంచి పంపారు. నాలుగిoట్లోనూ కుంకుమ ఉంది.

కిరణ్ కు ఆ ప్యాకెట్లు ఏం చేసుకోవాలో తెలియలేదు. పూజ గదిలో గప్ చుప్ గా మిగతా కుంకుమతో కలిపేసాడు. ఆదివారం తండ్రి వచ్చాడు.

పక్కింటి సింగ్ ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంటే, పుస్తకంలో మొహం దాచుకుని సీరియస్ గా ఉండటానికి ప్రయత్నించాడు కిరణ్.

సోమవారం మధ్యాహ్నం మళ్ళీ పోస్టుమాన్ వచ్చాడు. ఈసారి అతడి మోహంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనపడింది.

అతడికి చెప్పక తప్పలేదు. భయం భయంగా కారణమంతా చెప్పేసాడు.

అతడు చెప్పిందాన్ని క్లాసంతా ఆశ్చర్యంగా విన్నది.

అంతా విని కవర్ తెరవమంది. అందరూ తలో రెండు కవరులూ విప్పి ఎర్రటి కుంకుమ ప్యాకెట్లు టేబులుమీద గుట్టగా పోసారు.

భారతదేశపు ఉత్తరకొసనుంచి దక్షిణాది రాష్ట్రానికి వంతెనకట్టినట్లున్నాయి ఆ ఉత్తరాలు.

చాలా మంది పిల్లలకి ఆంధ్రప్రదేశ్ ఉందని తెలుసు కానీ, మిగతా వివరాలు అంతగా తెలియవు. దేశపు మరో మూల నుంచి ఒక అబ్భాయి ఇలా తమ కుంకుమ కోసం వ్రాయడం వాళ్ళకి భలే అనిపించినట్టు ఆ ఉత్తరాలే చెపుతున్నాయి.

చాలా మంది తమ వూరు రమ్మని ఆహ్వానించారు కూడా. ఒక కుర్రవాడు వ్రాసిన ఉత్తరం గమ్మత్తుగా వుంది. ‘ఆ కొట్లో కేవలం ఆఖరి ప్యాకెట్ మాత్రమే మిగిలిందని, గత మూడు రోజులుగా అమ్మకాలు పెరిగి స్టాకు అయ్యిపోయినట్టు కొట్టువాడు చెప్పాడని’ వ్రాసాడు.

టీచర్ కుర్రవాళ్ళను తలో ప్యాకెట్టు తీసుకెళ్లమంది. అలాగే ఆ అబ్బాయిలతో కలం స్నేహం చేసుకొమ్మని సలహా ఇచ్చింది. మన సంస్కృతి గురించీ, మన రాష్ట్రం గురించీ ఎలా వ్రాయాలో చెప్పింది.

ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఆ రోజు క్లాసు జరిగింది.

ఖాళీ కవరులు గాలిలో ఎగురుతున్నాయి. స్నేహానికి స్వాగత పత్రాల్లా ఉన్నాయవి. ఒక కుర్రవాడి ‘చిన్ని’ సమస్యని ఎదుర్కోవడం కోసం… వందల చిన్న చేతులు,ఎల్లలు దాటి, సరిహద్దులు దాటి, జాతి మత అడ్డంకుల్ని దాటి ఈ చివర్నుంచి ఆ చివరకు దేశపు కొసళ్ళదాకా పాకినట్టున్నాయి.

దాన్ని విప్పి చదివాడు.

డియర్ కిరణకుమార్,

నీ కోసం పవిత్రసింధూర్ కొందామని ఎంతో అనుకున్నాను. కానీ మేము చాలా బీదవాళ్ళము. నాకు నలుగురు అక్కయ్యలు.

నా తండ్రి వ్యవసాయం చేస్తుండగా నెలరోజుల క్రితం పొలంలో టెర్రరిస్టులు కాల్చేశారు. అమ్మ అప్పటినుంచి ఏడుస్తూనే వుంది. అక్కయ్యల దగ్గర కూడా డబ్బులు వుండవు.

తొందరలోనే నేను ఎలాగైనా నీకు సింధూర్ పంపుతాను. ఇట్లు, భారతసింగ్ సిద్ధూ.