ఇటీవలే కష్టపడకుండా మోసం చేసి డబ్బు సంపాదించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.అమాయక ప్రజలను మోసం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ సులభంగా డబ్బు, బంగారం కొట్టేస్తున్నారు.
ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన హైదరాబాదు నగరంలో చోటుచేసుకుంది.ఓ వృద్ధురాలి బంగారంపై కన్నేసిన నకిలీ వైద్యుడు, రోగాన్ని తొందరగా నయం చేస్తానని నమ్మించి మత్తుమందు ఇచ్చి ఆమె ఒంటిపై ఉండే బంగారం తీసుకుని పరారయ్యాడు.
కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళితే.తూర్పుగోదావరి జిల్లా( East Godavari District )కు చెందిన నూకల సుజాత అనే వృద్ధురాలు హైదరాబాదు నగరంలోని KPHB ప్రాంతంలో టీ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది.అయితే ఆమె ఈ నెల రెండున బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ కోసం రైల్లో విజయవాడ వెళుతుండగా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఆ వ్యక్తి తాను డాక్టర్ అని నిమ్స్ లో సర్జన్ గా పని చేస్తున్నట్లు కాస్త బిల్డప్ ఇచ్చాడు.దీంతో సుజాత తనకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి ఆ నకిలీ డాక్టర్ కు వివరించింది.
తర్వాత నకిలీ డాక్టర్ ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తానని, తాను చెప్పే చోటికి రావాలని చెప్పాడు.

సుజాత విజయవాడలో ఫంక్షన్ ముగించుకొని తిరిగి గురువారం ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ కి బయలుదేరింది.ఆ సమయంలో ఆ నకిలీ డాక్టర్ ఫోన్ చేసి, తాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ( Secunderabad )సమీపంలో ఉండే వినాయక లాడ్జిలో ఉన్నానని చెప్పాడు.అక్కడికి వస్తే మందులు ఇస్తాను అనడంతో ఆ వృద్ధురాలు ఎంతో నమ్మకంతో వినాయక లాడ్జి కి వెళ్ళింది.
ఆ నకిలీ వైద్యుడు కొన్ని మత్తు మందులు ఇచ్చి, అవి వేసుకోవాలని వృద్ధురాలిని సూచించాడు.ఆ మందులు వేసుకున్న కాసేపటికి వృద్ధురాలు స్పృహ కోల్పోయింది.వెంటనే ఆ నకిలీ డాక్టర్ ఆమె ఒంటిపై ఉండే బంగారు నగలతో అక్కడి నుంచి పారిపోయాడు.కాసేపటికి ఆ వృద్ధురాలికి మెలుకువ రాగా ఒంటిపై నగలు తన బ్యాగులో ఉన్న కాస్త నగదు లేకపోవడంతో వెంటనే గోపాలపురం పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా నకిలీ డాక్టర్( Fake doctor ) ను గాలిస్తున్నారు.
