క్రిష్‌ మార్క్‌ కనిపిస్తుంది.. ఎన్టీఆర్‌ అదరహో ఖాయం       2018-07-06   01:15:02  IST  Raghu V

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంను మొదట తేజ దర్శకత్వంలో అనుకున్నారు. అయితే ఎన్టీఆర్‌ చిత్రానికి తేజ న్యాయం చేయలేడని అంతా భావించారు. అదే విషయం తేజ కూడా భావించి స్వయంగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్‌కు తాను న్యాయం చేయలేనేమో అనిపిస్తుంది, ఆ స్థాయిలో తాను సినిమా తీయలేనేమో అనిపిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ నుండి తాను తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తేజ తప్పుకున్న తర్వాత పలువురు దర్శకులను బాలయ్య పరిశీలించాడు.

ఎంత మందిని పరిశీలించినా కూడా ఇలాంటి సినిమాకు క్రిష్‌ అయితేనే న్యాయం చేయగలడని బాలకృష్ణ భావించాడు. అందుకే కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు, పారితోషికం, బడ్జెట్‌ పెరిగినా పర్వాలేదు ఖచ్చితంగా ఎన్టీఆర్‌ సినిమాకు క్రిష్‌తో దర్శకత్వం చేయించాలని భావించారు. అయితే ఎన్టీఆర్‌ చిత్రంకు క్రిష్‌ దర్శకుడు అంటూ ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. భారీ స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుందని, క్రిష్‌ మార్క్‌తో ఈ చిత్రంను తెరకెక్కించడం ఖాయం అని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌గా బాలకృష్ణ లుక్‌ రివీల్‌ అయ్యింది. మనదేశం చిత్రంతో ఎన్టీఆర్‌ సినీరంగ ప్రవేశం అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన సీన్స్‌ను బాలకృష్ణపై చిత్రీకరించడం జరిగింది. అందుకు సంబంధించిన చిన్న స్టిల్‌ను క్రిష్‌ విడుదల చేశాడు. సినిమా స్టిల్స్‌ మరియు ఇతరత్ర విషయాలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్తున్నాయి. భారీ ఎత్తున సినిమాను క్రిష్‌ తెరకెక్కించబోతున్నాడు అని, ఎన్టీఆర్‌ను ప్రేక్షకుల ముందుకు క్రిష్‌ దించబోతున్నాడు అంటూ అనిపిస్తుంది. తప్పకుండా ఇది క్రిష్‌ మార్క్‌తో ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటూ అప్పుడే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్న విషయం తెల్సిందే. దాదాపు 100కు పైగా గెటప్స్‌తో బాలయ్య అలరించబోతున్నాడు. ఇక ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటించబోతుంది. ఇప్పటికే ఆమె హైదరాబాద్‌ వచ్చేసి చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషించనుండగా చంద్రబాబు నాయుడు పాత్రను రానాతో వేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా కృష్ణ పాత్రలో మహేష్‌బాబు, ఏయన్నార్‌ పాత్రలో సుమంత్‌లు కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్‌ రాబోతున్నాడు.