తెలుగు మీడియాకు కర్ణాటక సీఎం బాకీ.. ఎలాగో తెలుసా?       2018-05-20   23:43:23  IST  Bhanu C

అనూహ్య పరిణామాల మద్య అతి తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌ అధినేత కుమారస్వామి కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. కర్ణాటక సీఎంగా బీజేపీకి చెందిన యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు కూడా ముగియకుండానే తన బలం నిరూపించుకోలేక తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. దాంతో కాంగ్రెస్‌ మద్దతుతో జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఈ పరిణామాలు హైదరాబాద్‌ నుండి జరగడం ఆసక్తికర విషయం.

కుమార స్వామికి తెలుగు రాష్ట్రాలకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కుమార స్వామికి మరియు ఆయన తండ్రి అయిన దేవగౌడలకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ కారణంగానే కేసీఆర్‌ జేడీఎస్‌ మరియు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్‌ సహాయ సహకారం వల్లే బీజేపీలోకి తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా కుమార స్వామి చూసుకున్నాడు. ఇక ప్రమాణ స్వీకారంకు సిద్దం అయిన కుమార స్వామి వైపు తెలుగు న్యూస్‌ ఛానెల్స్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ ఆసక్తిగా చూస్తున్నాయి.

సినిమా పరిశ్రమకు కుమార స్వామికి సన్నిహిత సంబంధాలున్నాయి. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇటీవలే తన కొడుకు నిఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ కన్నడ మరియు తెలుగులో ‘జాగ్వర్‌’ అనే చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. ఒక కొత్త హీరోతో అంత బడ్జెట్‌ సినిమా గతంలో ఎప్పుడు లేదు. తన కొడుకుపై ఉన్న అభిమానంతో ప్రేమతో అంత భారీగా ప్లాన్‌ చేశారు. తెలుగులో ఈ చిత్రం ప్రమోషన్‌కు భారీ ఎత్తున ఖర్చు చేశారు. దాదాపు అన్ని ఛానెల్స్‌లో కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ చేశారు.

సినిమా విడుదలకు ముందు కొంత మొత్తంను చెల్లించగా, సినిమా విడుదల తర్వాత పూర్తి మొత్తం చెల్లిస్తామని ఛానెల్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. కాని సినిమా విడుదలై అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఛానెల్స్‌కు ఇచ్చే మొత్తంను ఎగవేసి కుమార స్వామి కర్ణాటకలో పడ్డాడు. తెలుగు మీడియాకు కుమార స్వామి దాదాపుగా 2.65 కోట్ల మేరకు బాకీ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. సీఎం అయిన తర్వాత అయినా ఆయన మీడియాకు పడ్డ బాకీని తీర్చుతాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుమారస్వామి వద్దకు వెళ్లాలని పలు టీవీ ఛానెల్స్‌ యాడ్‌ ప్రతినిధులు భావిస్తున్నారు. మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి.