కేసీఆర్ సంతకం.. రైతుల పాలిట మరణ శాసనం: కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఆగ్రహం
TeluguStop.com
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి కేసీఆర్ ఎలా లేఖ రాశారని, రాష్ట్రంలో పండించిన వడ్లన్నీ కేసీఆరే కొనుగోలు చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 47వ రోజు కు చేరుకుంది.
దానిలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తాళ్లచెరువు గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
అనంతరం పెద్ద పోచారం గ్రామానికి పాదయాత్ర చేరుకోగా, గ్రామంలోని రైతు వేదిక వద్ద వడ్ల కొనుగోళ్లపై ధర్నా చేశారు.
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆరే స్వయంగా కేంద్రానికి లేఖ రాసి, సంతకం పెట్టారని, అసలు రైతుల తరఫున సంతకం చేసే హక్కు కేసీఆర్ కు ఎక్కడిదని, ఏ రైతును అడిగి సంతకం చేశారని, కేసీఆర్ సంతకం రైతుల పాలిట మరణ శాసనంగా మారిందన్నారు.
ఇప్పటికే రైతులు అప్పులపాలై బాధపడుతుంటే కేసీఆర్ లేనిపోని సమస్యలు సృష్టించి, మళ్లీ రైతుల మీదే భారం మోపుతున్నారు.
ఓవైపు రుణమాఫీ లేదు, సబ్సిడీ విత్తనాలు లేవు, ఉచిత ఎరువులు లేవు, ఇన్ పుట్ సబ్సిడీ లేదు, యంత్ర లక్ష్మి లేదు, మరోవైపు వరి వేయొద్దని, వడ్లు కొనబోమని రైతుల్ని నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా తగ్గడానికి కేసీఆరే కారణం.యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎలా లేఖ రాశారు? 80వేల పుస్తకాలు చదివిన అపరమేధావికి బాయిల్డ్ రైస్ ఎప్పుడు వస్తుందో తెలియదా? తానే సంతకం పెట్టి రైతులను బావిలో తోసి, రైతులు మునిగిపోతుంటే, కేసీఆర్ గారు రక్షించండి రక్షించండి అని నేడు ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
"""/"/
కేసీఆర్ రాసిన లేఖ వల్లనే కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోందని, అందువల్ల కేసీఆరే రైతులు పండించిన వడ్లన్నీ బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
వరి వేసుకునే హక్కు రైతులకు ఉందని దాన్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదని, కేసీఆర్ చేసిన తప్పుకు రైతులను శిక్షించడం న్యాయం కాదని, కేసీఆర్ బేషరతుగా ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజశేఖర రెడ్డి హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారని, రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందేవని, ఇన్‌పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మి ద్వారా ఆదుకున్నారని, పంట నష్టపోతే పరిహారం ఇచ్చి ఆదుకున్నారు.
మద్దతు ధరతో పాటు 20శాతం బోనస్ ప్రకటించి వడ్లు కొన్నారని, సన్నొడ్లు పండిస్తే దిగుబడి తక్కువ, శ్రమ ఎక్కువ అని భావించి, క్వింటాలుకు 300 అదనంగా చెల్లించారు.
అంతేకాక రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి, ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు. """/"/
కేసీఆర్ కు పంట నష్టపరిహారం ఇవ్వాలన్న సోయి లేదని, గతంలో ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి, రైతుల్ని మోసగించారన్నారు.
మిల్లర్లకు లాభాలు చేకూరాలనే ఉద్దేశంతోనే నేడు వడ్లు కొనబోమని చెబుతున్నారు.గతంలో రైతులు సన్నొడ్లు పండించాలని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదు, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వానాకాలంలో రైతుల వడ్లు కొనకుంటే మిల్లర్లు కుమ్మక్కై రైతుల వద్ద తక్కువ ధరకే వడ్లు కొన్నారని దీనిపై కేసీఆర్ ఏనాడూ స్పందించలేదన్నారు.
రైతులు అప్పులపాలు కావడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి కేసీఆరే కారణం అని విమర్శించారు. """/"/
కేసీఆర్ ఎనిమిదేండ్లలో రైతులను అడుగడుగునా మోసం చేశారు.
రుణమాఫీ పేరుతో మోసం చేశారు.పంట బీమా ఇస్తానని మోసం చేశారు.
ఉచిత ఎరువులు అని మోసం చేశారు.రైతులు పండించిన చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
కొనుగోలు చేసిన వడ్లను రా రైస్ చేసుకుంటారో, బాయిల్డ్ రైస్ చేసుకుంటారో, బంగారం చేసుకుంటారో కేసీఆర్ ఇష్టం.
ఆ బియ్యం పక్క రాష్ట్రంలో అమ్ముకుంటారో, పక్కదేశాల్లో అమ్ముకుంటారో కేసీఆర్ పనితనం మీద ఆధారపడి ఉంటుంది.
అంతేకానీ అన్నిసమస్యలు తీసుకొచ్చి, రైతు నెత్తిన మోపడం ముమ్మాటికీ అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీయార్ మిస్ చేసుకున్న సినిమా అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది…మరి ఫలితం ఏంటి..?