కలెక్టరేట్ లో కలకలం రేపిన మహిళల ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా: వంశ పారంపర్యంగా వచ్చిన భూమిని ఇతరులు కబ్జా చేశారని గత కొన్నేళ్లుగా రెవిన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకి న్యాయం జరగలేదని ఆరోపిస్తూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ముగ్గురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, మరో రైతు ఇదే కారణంతో పురుగుల మందుడబ్బాతో రావడం కలకలం రేపింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామనికి చెందిన ఎస్టీ మహిళ మేడం అరుణ కుటుంబానికి వంశ పారంపర్యంగా 10 ఎకరాల భూమి వచ్చింది.

అందులో 2 ఎకరాల 20 గుంటల భూమి సర్వే నంబర్ 190/24 లో పహానీ ఉంది.

తాము జీవనోపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లి వచ్చే వరకు మా పక్కనే ఉన్న వ్యక్తులు కబ్జా చేసి మమ్మల్ని మా భూమిలోకి రానివ్వడం లేదు.

దీనిపై గత కొన్నేళ్లుగా స్థానిక ఎమ్మార్వోను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో విసుగు చెంది కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి,కలెక్టర్ కు పిర్యాదు చేయడానికి ముందే తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ముగ్గురు మహిళలు పోసుకునే క్రమంలో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు.

తమకు తాతల నుండి వచ్చిన భూమిని కబ్జా చేసి మమ్మల్ని అందులోకి రాకుండా అడ్డుకుంటూ బెదిరిస్తున్నారని,ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని బాధిత మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదిలా ఉండగా సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన అవుట నాగయ్య అనే రైతు సర్వే నంబర్ 836 లో గల 2 ఎకరాల 11 గుంటల తన భూమిని కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి బలవంతంగా లాక్కొని,అందులో బోర్డు పెట్టి,నన్ను రానివ్వడం లేదని వాపోతూ తన వెంట తెచ్చుకున్న మందు డబ్బాను తీయబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

బాధిత రైతు మాట్లడుతూ కబ్జా చేసిన వ్యక్తి తన వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకొని కొంతమందితో నా భూమి దగ్గరకు వచ్చి నా భూమి కౌలుకు చేసే వ్యక్తిని తరచూ బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు.

ఇప్పటికైనా తమ గోడును అర్దం చేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

యూఎస్: కోర్ట్‌రూమ్‌లో నేరస్థుడు ఎలాంటి రిక్వెస్ట్ చేశాడో తెలిస్తే…