పాత ఇనుముకు ఉల్లిగడ్డలు అమ్మినట్లుగా ఊరూరూ తిరుగుతున్న వైన్స్ ఆటో…!

సూర్యాపేట జిల్లా: మద్యం మత్తుకు యువత బానిసలై అది సరిపోక గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో లిక్కర్ దందా యధేచ్చగా కొనసాగుతుంది.

మండలంలోని వైన్స్ షాపుల యాజమాన్యం సిండికేట్ గా మారి వైన్స్ లో ఎమ్మార్పీ ధరలకు విక్రయించాల్సిన మద్యాన్ని పాత ఇనుముకు ఉల్లిగడ్డలు అమ్మినట్లుగా ఆటోలో లిక్కర్ కాటన్లు వేసుకొని ఊరూరూ తిరిగి బెల్ట్ షాపులకు ఎమ్మార్పీ కంటే రూ.

15 నుండి రూ.20 లకు అధికంగా వేస్తున్నారు.

ఇదే అదునుగా బెల్ట్ షాపు నిర్వాహకులు మరింత అదనంగా ఒక్కో క్వార్టర్ పై రూ.

40 నుండి రూ.50 వరకు విక్రయిస్తూ మద్యం ప్రియులను నిలువు దోపిడి చేస్తున్నారు.

వెన్స్ లో ఉండాల్సిన మద్యం ఆటోలో ఎలా వెళుతుంది? ప్రభుత్వ ఎక్సైజ్ నిబంధనల మేరకు ఆయా వైన్స్ షాపులకు కేటాయించిన నిర్దిష్ట మద్యం నిల్వలు వైన్స్ లలో ఉండాలి.

దానికి సంబంధించి ప్రతి రోజూ విక్రయించిన,నిల్వ ఉన్న మద్యం వివరాలు పొందు పరచాలి.

కానీ,మునగాల మండలంలో ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్ చేస్తూ ఇష్టారాజ్యంగా లిక్కర్ దందా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

ఆటోలో లిక్కర్ దందాకు అనుమతులు ఇచ్చేదెవరు? ఒక్కో గ్రామంలో 5 నుండి 15 వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని,వాటికి ఆటోలో లిక్కర్ సరఫరా చేస్తున్నారు.

బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకుంటుంటే,అది చాలదన్నట్లు వైన్స్ సిండికేట్ ఆటోలో నేరుగా బెల్ట్ షాపుకు మద్యం సరఫరా చేస్తూ ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.

20 లకు వేయడంతో బెల్ట్ షాపుల్లో మద్యం మరింత ప్రియంగా మారింది.ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులకు తెలియదా అంటే అందరికీ తెలిసే జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

లేకుంటే ఇంత బరితెగించి లిక్కర్ దందాకు ఎలా చేస్తారనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

మునగాల మండలంలో జరుగుతున్న ఈ లిక్కర్ దందాకు అనుమతులు ఇస్తున్న వారెవరనే విషయం అర్దం కావడం లేదు.

ఎవరి అనుమతి లేకుండా మద్యం దందా జరిగే అవకాశమే లేదు.ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపులను బంద్ పెట్టాలని యోచిస్తుంటే,ఇప్పటికే మునుగోడులో స్థానిక ఎమ్మెల్యే బెల్ట్ పై పెద్ద పోరాటమే చేస్తుంటే, మునగాలలో మాత్రం బెల్ట్ షాపులను మరింత బలోపేతం చేస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆటోలో లిక్కర్ దందాకు అనుమతులు ఇచ్చేదెవరూ?అనుమతులు లేకుంటే ఎలా అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతుంది? సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

ఇదే విషయమై ఎక్సైజ్ ఎస్ఐ రామకృష్ణను వివరణ కోరగా ఆటోలో లిక్కర్ సరఫరా చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదని,బెల్టు షాపులకు ఆటోలో లిక్కర్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సు రద్దు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు.

బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన సినిమాలివే.. వీటికి మాత్రమే ఇంత క్రేజ్!