ఓడినా, గెలిచినా కమ్యూనిస్టులు ప్రజల పక్షమే: మాజీ ఎమ్మెల్యే జూలకంటి

సూర్యాపేట జిల్లా: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైపు నుండి జరిగిన లోపల సమీక్షించుకొని, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే పార్టీ క్యాడర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి,అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీగా ఓటర్లు చూశారు తప్ప మూడవ పార్టీకి అవకాశం ఇవ్వలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సక్రమంగా అమలు చేయకపోవడం, నిరంకుశంగా వ్యవహరించడం,కుటుంబ పాలన,అవినీతి,నిధుల దుర్వినియోగం,స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు.

సిపిఎం, ప్రజా సంఘాల నుండి రావలసిన ఓట్లను ఎన్నికల్లో నిలబెట్టలేక పోయామన్నారు.ఇది బలహీనతగా గుర్తించవలసిన అవసరం ఉందన్నారు.

దీనిపై పార్టీ ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు సాగవలసి ఉందన్నారు.బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వారు విచ్చలవిడిగా డబ్బు, మద్యం,మటన్,చికెన్ పంచి పెట్టారన్నారు.

అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసి ఓట్లను ఆకర్షించే విధంగా చేశారన్నారు.అక్కడక్కడా వివిధ గ్రామాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఇతర అభ్యర్థులకు ప్రచారం చేశారని,వారికి ఓట్లు వేయించారని వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు.

పార్టీకి ద్రోహం చేసినవారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.పార్టీ క్యాడర్ మరింత ప్రజలకు దగ్గరకు కావాలన్నారు.

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ నిర్మాణాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు.కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నామని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి మంచి పనికి సిపిఎం మద్దతు సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు.

కమ్యూనిస్టులకు ఓట్లు,సీట్లు ముఖ్యం కాదని,ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.ఓడినా, గెలిసినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో ముందు వరుసలో ఉంటామన్నారు.

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, కొలిశెట్టి యాదగిరి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు,మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి,జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్30, సోమవారం 2024