సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్ట్ ఎక్కడ సారూ..!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి.

గత ప్రభుత్వం గ్రామాల్లో తడి,పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులు తయారు చేసి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.

2.40 లక్షలతో ప్రతీ గ్రామంలో షెడ్లను నిర్మించారు.

పంచాయితీ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఈ షెడ్లకు తరలించి, కంపోస్ట్ ఎరువులు తయారుచేసి గ్రామాల్లో సంపద సృష్టించాలని భావించారు.

కానీ,అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.కొంత కాలం పాటు ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించిన గ్రామ పంచాయితీ సిబ్బంది ఆ తర్వాత చెత్త సేకరణ కూడా సక్రమంగా జరపడం లేదని,అక్కడక్కడా తడి, పొడి చెత్తను వేరు చేయకుండా తరలించి ఓకే దగ్గర పోయడంతో దేనికి పనికి రాకుండా పోతుందని,గ్రామాల్లో షెడ్లు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు.

గ్రామాల్లోతడి,పొడి చెత్తను సేకరించి ఒకే చోట కుప్పగా పోయడంతో షెడ్లలో వేర్వేరు అవసరాల కోసం నిర్మించిన గదులు ఖాళీగా ఉంటున్నాయి.

కొన్ని గ్రామపంచాయతీల్లో మాత్రం తడి చెత్త నుంచి వర్మి కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నా, పొడి చెత్తలో లభించే ప్లాస్టిక్, గాజు,ఇనుము వ్యర్ధాలు ఒకే దాంట్లో తేవడంతో ఇబ్బందిగా మారిందని అంటున్నారు.

వానపాములు లేకుండా సేంద్రియ ఎరువు తయారీ సాధ్యం కాదని,సహజపద్ధతిలో తయారీకి 40 నుండి 60 రోజులు పడుతుందని చెబుతున్నారు.

ప్రారంభ దశలో కొందరు కార్యదర్శులు, సర్పంచులు వానపాములు కొని కొద్దిపాటి చెత్తలో వేసి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది.

సేంద్రియ ఎరువు తయారీపై కార్యదర్శులకు శిక్షణ కూడా ఇచ్చారని, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ పథకం అటకెక్కిందని,ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సరైన చర్యలు చేపట్టి చెత్త సేకరణ క్రమం తప్పకుండా జరిగేలా,తడి చెత్త నుండి సేంద్రియ ఎరువులు తయారు చేసేలా చూడాలని కోరుతున్నారు.

వింటర్ లో చర్మాన్ని తేమగా ఉంచడానికి తోడ్పడే బెస్ట్ హోమ్ మేడ్ లోషన్ ఇదే!