పెళ్లి ముహూర్తాలకి ఈ రోజుతో ఆఖరు… మళ్ళీ రెండున్నర నెలల తర్వాతనే

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే గొప్ప పండగ.ఈ వేడుకని జీవితాంతం గుర్తుంచుకునే విధంగా చేసుకోవాలని నేటి యువతరం భావిస్తున్నారు.

అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాటు చేసుకొని వైభవంగా బంధుమిత్రుల సపరివార సమేతంగా ఈ పెళ్లి వేడుకని జరుపుకుంటున్నారు.

ఇక ఈ పెళ్లి కోసం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అయితే లక్షల్లో ఖర్చు పెడతారు.

పెద్ద కుటుంబాలలో అయితే కోట్ల రూపాయిలు ఖర్చు పెడతారు.అయితే ఈ ఏడాది పెళ్ళిళ్ళు చేసుకునే వారికి ఇలా వైభవంగా పెళ్లి చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా ప్రభావం దేశంలో చూపించడం మొదలు పెట్టింది.

ఇక మార్చిలోనే ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఉండగా అదే నెల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.

ఈ నేపధ్యంలో లాక్ డౌన్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చని పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నారు.

అయితే లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.కరోనా విలయతాండవం చేయడం మొదలు పెట్టింది.

దీంతో ఈ పెళ్లి వేడుకలకి ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది.దీంతో చాలా మంచి ముహూర్తాలు మళ్ళీ రావని భావించిన వారు ఈ సమయంలోనే ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా పెళ్లి చేసేసుకున్నారు.

ఇలా చేసుకున్న వారిలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఉన్నారు.లాక్‌డౌన్‌ సీజన్‌లోనే మంచి ముహూర్తాలు దాదాపు వెళ్లిపోయాయి.

ఈ నెలకి ఆగస్టు 14 చివరి శుభ ముహూర్త తేదీగా ఉంది.ఈరోజు తప్పిందంటే శుభకార్యాలు చేసుకునే వారంతా మరో రెండున్నర నెలలు ఆగాల్సిందేనని పురోహితులు చెబుతున్నారు.

శ్రావణ మాసం చివరి దశకి వచ్చేయడంతో ముహూర్తాలు ముగిసిపోయాయి.భాద్రపద మాసంలో ఎక్కువగా పితృదేవతలకు నిర్వహించే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు.

తరువాత వచ్చే ఆశ్వయుజం అధిక మాసం వస్తుండడంతో శుభకార్యాలకు మరో నెల రోజులు బ్రేక్‌ పడనుంది.

దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాక మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు.ఏది ఏమైనా ఈ ఏడాది పెళ్ళిళ్ళు చేసుకున్నవారికి జీవితంలో తమ పెళ్లి తంతు కరోనా కారణంగా గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు..!!