గురుకులాల అవినీతిపై విజిలెన్స్ విచారణ జరపాలి: బీసీ విద్యార్థి సంఘం

నల్లగొండ జిల్లా:గురుకుల విద్యా సంస్థల్లో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల్లో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోందని,అన్ని బీసీ గురుకులాలు అక్రమాలకు నిలయాలుగా మారిపోయాయని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యను చిన్న చూపు చూడడం,సంబంధిత అధికారులు సరైన పర్యవేక్షణ చేయకుండా వదిలేయడంతో గురుకులాల్లో గుట్టు చప్పుడు కాకుండా అవినీతి జరుగుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాలలో తక్షణమే విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు.

ఎంతోమంది బడుగు,బలహీన వర్గాల పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు,కళాశాలలు నేడు పట్టు తప్పుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రస్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి అధికారులు, విద్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ప్రవేశ పరీక్ష రాసి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు సీట్లు కేటాయించకుండా,ఒక్క సీటు 30 వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని,దీంతో అసలు అర్హత సాధించిన పేద విద్యార్థికి అన్యాయం జరుగుతుందన్నారు.

జిల్లా ఆర్సీఓలు కాసులకు కక్కుర్తిపడి,కనీస సౌకర్యాలు లేని బిల్డింగులను అద్దెకు తీసుకొని విద్యార్థులను ఇబ్బందులను పట్టించుకోకుండా,వారి జేబులను నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలలో ఏ ఒక్కటి కూడా విద్యార్థులకు అనుకూలంగా లేకపోవడం చాలా దురదృష్టకరమని,కొన్ని పాఠశాలలకు కనీసం రవాణా సౌకర్యం కూడా ఉండదని,కొన్ని పాఠశాలలకు బిల్డింగులు ఉన్నా కానీ,వాటికి పాఠశాలలకు పహరి గోడ ఉండదని, దీంతో అనేక పాఠశాలలో పాములు రావడం జరుగుతుందన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో సిబ్బంది అక్రమ పద్ధతిన ఎంపిక చేయడం జరిగిందని,బడుగు,బలహీన వర్గాల పిల్లల మీద ప్రేమ ఉంటే గురుకులాలు జరుగుతున్న అవినీతి మీద విజిలెన్స్ కమిటీ ద్వారా విచారణ జరిపించి, అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

లేనియెడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధికి నటుడు రావు రమేష్ భారీ విరాళం..!!