ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కవచం కిట్ వినియోగం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగింపు,ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపు,గౌడ కులస్తులకు ఉపాధి కల్పన కోసం ఈత చెట్ల పెంపకానికి చర్యలు,నూతన గ్రంథాలయ భవనంలో నిర్వహించిన కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం విప్ రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లా :తాటి చెట్ల పై నుంచి కల్లు తీసే గౌడ కార్మికుల ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడుతున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas) అన్నారు.

మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఎంపీడీవో ప్రాంగణంలోని నూతన గ్రంధాలయ భవనంలో నిర్వహించిన కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ (Sandeep Kumar Jha)లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈత చెట్లు, తాడి చెట్లు జీవనాధారంగా కొనసాగుతున్న గౌడ సోదరులకు అవసరమైన సహాయం అందించేందుకు కాటమయ్య కిట్లను పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు.

కుల వృత్తులు చేస్తున్న సమయంలో జారి పడిపోయి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు రక్షణ కవచంగా నిలిచే కాటమయ్య రక్షణ కవచం కిట్లను అందిస్తున్నామని అన్నారు.

గౌడ కులస్తులకు ఇప్పటికే పెన్షన్ అందిస్తున్నామని, ప్రమాదాలు జరిగితే పరిహారం సైతం అందిస్తున్నామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి ఆర్థికంగా రాష్ట్ర చాలా దెబ్బతిందని, ప్రతి నెలా వచ్చే 18 వేల కోట్ల ఆదాయంలో 6 వేల కోట్ల అప్పుల వడ్డీలకే ఖర్చు అవుతుందని అన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అంశంలో వెనుకాడటం లేదని అన్నారు.

ఆర్థిక లీకేజీలను, ఆడంబరాలను అరికడుతూ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు.

గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ ప్రవేశ పెట్టామని, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ఏర్పాటు చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.

రేషన్ కార్డ్ స్థానంలో త్వరలోనే ఫ్యామిలీ కార్డు అందజేయడం జరుగుతుందని, ఆ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అందుతాయని అన్నారు.

ప్రతి రోజు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పని చేస్తుందని, ఇటీవల జరిగిన అసెంబ్లీలో కూడా ఉదయం ప్రారంభించి మరునాడు ఉదయం 3 గంటల వరకు ప్రజా సమస్యల మీద చర్చించడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం పై ఎవరైనా సూచన అందిస్తే దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

వేములవాడ దేవాలయం అభివృద్ధికి నిధులు తెచ్చుకున్నామని, అదేవిధంగా దశాబ్దాల కల వేములవాడలో నూలు యార్డ్ ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు.

ముంపు గ్రామాల ప్రజలకు ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నమని అన్నారు.సామూహికంగా పెద్ద ఎత్తున ఈత చెట్లు పెంచే అవకాశాలను పరిశీలించి ఆ దిశగా చర్యలు చేపడతామని ప్రభుత్వ విప్ తెలిపారు.

కాలువలకు ఇరు వైపులా ఈత చెట్లు నాటేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 మంది గౌడ కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ కిట్లను పంపిణీ చేస్తుందని, ఈ రోజు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలో ఎంపిక చేసిన 400 మంది లబ్ధిదారులకు రక్షక కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు.

చెట్లపై నుంచి జారి పడటం ద్వారా వచ్చే వైకల్యంతో అనేక ఇబ్బందులు గీత కార్మికులు పడేవారని, ఈ రక్షక కిట్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, దీని వినియోగం పై కార్మికులకు శిక్షణ సైతం అందించామని, దీనిని కార్మికులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని అన్నారు.

కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ, ప్రతి గీత కార్మికుడికి రక్షక కిట్(Protective Kit For Geetha Worker) అందించే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసి సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరీ, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలివే.. ఈ సినిమాలు హిట్టవుతాయా?