భయమో.. అనుమానమో, టీకాలపై అమెరికన్ల అనాసక్తి: రంగంలోకి జో బైడెన్

ప్రపంచాన్ని పెను విషాదంలోకి నెట్టిన కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూశారు.

నిద్రాహారాలు మాని, రాత్రిపగలు శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రతిఫలంగా కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది.

పలుదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి కూడా.ఇంత జరుగుతున్నా ప్రజల్లో ఏదో భయం, ఏదో అనుమానం.

టీకా తీసుకోవడం మంచిదేనా, ఏమైనా దుష్పరిణామాలు వస్తే పరిస్ధితేంటీ అన్న ఆందోళన పలువురిని వెంటాడుతోంది.

అయితే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశాధినేతలు, సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.

ఇక ప్రపంచంలోనే కరోనా ఉద్ధృతంగా వున్న అమెరికాలో అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించింది.

అయినప్పటికీ అమెరికన్లు టీకాలను తేలికగా తీసుకుంటున్నారు.స్వయంగా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఇతర ప్రముఖులు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకున్నా వారు మాత్రం భయాలను వీడటం లేదు.

దీంతో బైడెన్ రంగంలోకి దిగారు.దీనిలో భాగంగా టీకాలపై అవగాహన కలిగించే ఉద్దేశంతో త్వరలోనే ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

తన పరిపాలన విభాగం ప్రస్తుతం ఈ విషయమై కసరత్తు చేస్తున్నట్లు అధ్యక్షుడు తెలిపారు.

త్వరలోనే ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారని బైడెన్ వెల్లడించారు.

"""/"/ ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 5 లక్షలకు పైగా మంది కోవిడ్‌కు బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరగకుండా ఉండాలంటే టీకాలు తీసుకోవడమే మార్గమని బైడెన్ స్పష్టం చేశారు.

అందుకే అమెరికన్లలో టీకాలపై ఉన్న అపోహలను తొలగించి, వాటినే తీసుకునేలా ప్రోత్సహించడమే ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యోద్దేశమని అధ్యక్షుడు పేర్కొన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

2.5 కోట్లకు పైగా మాస్కులను పంపిణీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.

కొవిడ్‌పై పోరులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో వీటిని పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.

వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో మాస్కులు కీలకమని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికీ పేద అమెరికన్లు మాస్కులు కొనుగోలు చేయలేకపోతున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

సందీప్ రెడ్డి వంగ ను ట్రోల్ చేస్తున్న బాలీవుడ్ మాఫీయా…