భారత సంతతి యువకుడి హత్య : వీడని మిస్టరీ.. ప్రజల సహకారం కోరిన బ్రిటీష్ పోలీస్ శాఖ

భారత సంతతి సిక్కు కుటుంబానికి చెందిన 16 ఏళ్ల బాలుడి హత్య వ్యవహారం బ్రిటన్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

పైకి ఇది ఒక బ్యాగ్ కోసం జరిగిన హత్యగా పేర్కొనబడుతున్నప్పటికీ.జాత్యహంకార దాడిగా అక్కడి ఇండియన్ కమ్యూనిటీ ఆరోపిస్తోంది.

అయితే పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా ఈ కేసులో చిక్కు ముడి వీడటం లేదు.

దీంతో పోలీసులు ప్రజల సహకారం కోరారు.ఈ మేరకు స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు ఆదివారం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

అలాగే పోలీసులు బాధితుడి పేరును రిష్మీత్ సింగ్‌గా మార్చారు.తొలుత స్థానికంగా అష్మీత్ సింగ్ అని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే రిష్మీత్ హత్య కేసులో సహాయపడే సమాచారం లేదా సీసీటీవీ ఫుటేజ్‌ వున్న వారు తమను సంప్రదించాలని మెట్రోపాలిటిన్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఒక అల్లరి మూకల గుంపుతో జరిగిన గొడవకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో వారు బుధవారం సౌతాల్‌లోని రాలీ రోడ్‌కు చేరుకున్నారు.

లండన్ అంబులెన్స్ సర్వీస్ (ఎల్ఏఎస్) నుంచి పారామెడిక్స్‌తో పాటు అధికారులు కూడా అక్కడికి వచ్చారు.

ఎమర్జెన్సీ సర్వీస్‌ సిబ్బంది అతని ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ రిష్మీత్ సింగ్ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు.

అనంతరం అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.రిష్మీత్ మరణానికి కారణమైన వ్యక్తిని లేదా వ్యక్తులను పట్టుకోవడానికి అహోరాత్రులు కృషి చేస్తున్నామని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ జేమ్స్ షిర్లీ అన్నారు.

ఘటన జరిగిన బుధవారం రాత్రి 9 గంటల తర్వాత రాలీ రోడ్ చుట్టు పక్కల ప్రాంతంలో సంఘటనను చూసినవారితో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే ఎలాంటి ఆధారాలు వున్నా తక్షణం పోలీసులను సంప్రదించాలని జేమ్స్ సూచించారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్‌లు చోటు చేసుకోలేదు.అయితే అతని మిత్రుల కథనం ప్రకారం.

రిష్మీత్ సింగ్ వద్ద గుచ్చీ అనే ఖరీదైన బ్రాండ్ కంపెనీకి చెందిన బ్యాగ్ కోసమే హత్య జరిగిందని తెలుస్తోంది.

సదరు బ్యాగ్ ఖరీదు కంటే కూడా కంపెనీ బ్రాండ్‌పై క్రేజ్ ఎక్కువట.ఈ బ్యాగ్ దొంగిలించే క్రమంలోనే రిష్మీత్ సింగ్‌ను దుండగులు చంపి వుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లాలో ఒక్క నిమిషం నిబంధనతో అభ్యర్థికి చుక్కెదురు..!