బీజేపీలోకి టీఆర్ఎస్ నేత..ముహూర్తం ఫిక్స్?
TeluguStop.com
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్ రెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారట.
గత కొంత కాలంగా గులాబీ పార్టీ వ్యవహారాలతో అంటీఅంటనట్లుగా వ్యవహరిస్తున్న జూపల్లి.వచ్చే నెలలో కమలం గూటికి చేరేందుకు సిద్దమైనట్లు టాక్ నడుస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది.ఈ పాదయాత్ర ముగిసేలోగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరి చేరికలకు అవకాశం ఉందట.
లేదా మే 14న జరిగే పాదయాత్ర ముగింపు సమావేశానికి అమిత్ షా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన సమక్షంలోనైనా కమలం కండువా కప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
పార్టీ మార్పుపై జిల్లా ముఖ్యనేతలతో పాటు బండి సంజయ్ తరపు ప్రతినిధులు రెండు మూడు దఫాలుగా జరిపిన చర్చల సందర్భంగా చల్లా వెంకట్రామ్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారట.
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కుమార్తె కుమారుడైన చల్లా వెంకట్రామ్ రెడ్డికి అలంపూర్ నియోజకవర్గంతో పాటు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది.
ఆయన 2004 నుండి 2009 వరకు అలంపూర్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పని చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇచ్చారు.
అనంతరం 2009లో తన మద్దతుతో ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ అబ్రహంకు మద్దతు ఇచ్చారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌లో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న శాసనసభ సభ్యుడు డాక్టర్ సంపత్ కుమార్ కు ఆయన మద్దతు ఇచ్చారు.
ప్రస్తుతం వెంకట్రామ్ రెడ్డి వనపర్తి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే ప్రచారం పొలిటికల్ కారిడార్ లో నడుస్తోంది.
"""/"/
మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన జూపల్లి కృష్ణారావు పార్టీ మార్పు కొంత కాలంగా హాట్ టాపిక్ అవుతోంది.
ఇప్పటికే ఆయన తన అనుచరులతో చర్చలు జరిపారు.2014 ఫలితాల తర్వాత తెలంగాణ తొలి కేబినెట్ లో సీఎం కేసీఆర్ జూపల్లికి మంత్రిగా ఛాన్స్ కల్పించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి జూపల్లి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
అనంతరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడంతో స్వంత పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య వర్గపోరుకు బీజం పడింది.
కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు తన అభ్యర్థులను గెలిపించుకున్నారన్న ప్రచారం జరిగింది.
ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం సైతం సీరియస్ అయింది.అయితే తన పార్టీ మార్పుపై ఇటీవల స్పందించిన ఆయన వచ్చే 9 నెలల్లో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు.
తన నిర్ణయం ప్రజల కోసమే ఉండబోతోందన్న ఆయన.త్వరలోనే బీజేపీ గూటికి చేరేందుకు మూహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తన వైపు తిప్పుకోవడం వీరి చేరికతో తిరిగి ప్రారంభించబోతోందా? అనేది చర్చగా మారుతోంది.
ఇదే జరిగితే ఆ ప్రభావం టీఆర్ఎస్ పై ఏ మేరకు పడబోతోందన్న టాక్ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
ఖలిస్తానీలకు కెనడియన్ సిక్కులకు సంబంధం లేదు : ట్రూడో సంచలన వ్యాఖ్యలు