పీకే దెబ్బకు టీఆర్ఎస్ డైలమా?

ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారని అంతా భావించారు.కానీ ప్రస్తుతం ఆయన గులాబీ పార్టీకి ట్విస్ట్ ఇచ్చారు.

ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీ నాయకులతో సమావేశమైన ఆయన ఆ పార్టీకి వ్యూహకర్తగా ఉండేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది.

మరోవైపు పీకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని హస్తం పార్టీ నాయకులు చెబుతున్నారు.దీంతో టీఆర్ఎస్ డైలమాలో పడిపోయింది.

మరి ప్రస్తుతం టీఆర్ఎస్‌తో పీకే అనుబంధం తెగిపోనుందా? డీల్ నుంచి స్వచ్ఛందంగా ఆయనే తప్పుకుంటారా?అనేది నేతల ఆందోళనలో ఉన్నారు.

రానున్న 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

త్వరలోనే పార్టీలోనూ చేరుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.దీంతో జాతీయ రాజకీయాలతోపాటు రాష్ట్రంలోనూ ఆయన సేవలను వినియోగించుకోవాలన్న టీఆర్ఎస్ పార్టీకి పీకే బిగ్ షాక్ ఇచ్చినట్టయింది.

ఆయన కాంగ్రెస్‌‌కు పనిచేస్తే టీఆర్ఎస్ సంగతేంటనే చర్చలు మొదలయ్యాయి.తెలంగాణలో ఈ రెండు పార్టీలూ ప్రత్యర్థులుగా ఉన్నందున ఏక కాలంలో రెండు పార్టీలకూ వ్యూహకర్తగా వ్యవహరించడం సాధ్యం కాదనేది క్లియర్.

ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేయబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి సోనియాగాంధీ సహా సీనియర్ నేతలకు ప్రశాంత్ కిషోర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

అవలంబించవల్సిన వ్యూహం గురించి వివరించారు.ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే జరిగితే.ఇప్పటివరకూ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న 'ఐ ప్యాక్' సంస్థను ఏం చేస్తారు? ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలుకే మళ్లీ దాన్ని అప్పగిస్తారా? ఒకప్పుడు అందులో పనిచేసిన అనుభవంతో సొంతంగా పలు సర్వే సంస్థలు పెట్టుకున్న సునీల్ వాటిని మూసేసి తిరిగి మాతృసంస్థకే వెళ్లిపోతారా? ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఇప్పుడే ఇవే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

"""/" / ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ ఇటీవల నొక్కిచెప్పారు.

టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చే నెలలో వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగసభకు ఆయన హాజరుకానున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర నేతలకు రూట్ మ్యాప్‌నూ ఇచ్చారు.

మరోవైపు పీకేను జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు వ్యూహకర్తగా వాడుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది.ఈ విషయాన్ని గులాబీ బాసే పలు సందర్భాల్లో వెల్లడించారు.

30 నియోజకవర్గాల్లో సర్వే కూడా పూర్తయిందని, శాస్త్రీయ పద్ధతిలో పబ్లిక్ పల్స్ పట్టుకోవడంలో పీకేకు ప్రత్యేక సమర్ధతలు ఉన్నాయని కొనియాడారు.

"""/" / ఢిల్లీలో ఇటీవల మూడు రోజులపాటు మంతనాలూ జరిపారు.ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా, పూర్తికాలం పార్టీ సభ్యుడిగా పీకే వ్యవహరిస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనే చర్చలు మొదలయ్యాయి.

ఏక కాలంలో రెండు ప్రత్యర్థి పార్టీలకు పనిచేయడం సాధ్యం కానందున పీకేను టీఆర్ఎస్ వదిలించుకుంటుందా? డీల్ అసంపూర్తిగా ముగిసినట్లేనా? లేదా స్వయంగా పీకే ఈ డీల్ నుంచి తప్పుకుంటారా? అనే అంశాలు గులాబీ శ్రేణుల్ని ప్రస్తుతం అయోమయానికి గురిచేస్తున్నాయి.

ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో బలమైన శక్తిగా అవతరించాలని టీఆర్ఎస్ భావిస్తున్నది.

రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నది.ఈ రెండు ప్రయోజనాల కోసం పీకేతో కలిసి పనిచేయాలనుకుంటున్నది.

కానీ ఊహించని తీరులో పీకే షాక్ ఇవ్వడంతో ఇప్పుడు టీఆర్ఎస్ డైలమాలో పడింది.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా పరస్పరం ప్రత్యర్థులు.కానీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడంలో మాత్రం ఈ రెండు పార్టీలదీ ఒకటే ఎజెండా.

ఆ పోరాటంలో జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా? టీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని రాహుల్‌గాంధీ ప్రకటించినందున ఇప్పుడు కలిపే చొరవను పీకే తీసుకుంటారా? అదే జరిగితే రాష్ట్ర స్థాయిలో పరిణామాలు ఎలా ఉంటాయి? కాంగ్రెస్ పార్టీతో పీకేకు డీల్ కుదరడంతో ఇకపైన ఆయనను దూరం పెట్టడం టీఆర్ఎస్‌కు అనివార్యంగా మారింది.

ఇప్పటివరకూ టీఆర్ఎస్‌కు వ్యూహకర్తగా పీకే ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదు.ఈ విషయంపై మే నెల 2వ తేదీ తర్వాత క్లారిటీ వస్తుందంటూ స్వయంగా పీకే ఇటీవల వ్యాఖ్యానించారు.

దీంతో మరికొన్ని వారాల్లో టీఆర్ఎస్ పార్టీకి, పీకేకు ఉండే బంధం సంగతి తేలిపోనున్నది.

కేసీఆర్‌ను మించిన వ్యూహకర్త ఎవరున్నారు అంటూ గులాబీ శ్రేణులు ఒకింత గర్వంగానే చెప్పుకుంటున్నాయి.

పీకేను సైంటిఫిక్ వ్యూహకర్తగా కేసీఆర్ పరోక్షంగా గుర్తిస్తున్నారు.ఇప్పుడు ఈ ఇద్దరు వ్యూహకర్తల వ్యూహమేంటనేదే తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ చర్చ.