ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయం!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:గులాబీ లీడర్ల అక్రమ మైనింగ్ దందాతో నిత్యం భారీ వాహనాల రాకపోకల కారణంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ నుంచి పిట్టంపల్లి, తాళ్లవాయిగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్డు మొత్తం ధ్వంసమై ప్రజా రవాణాకు అవరోధంగా మారిందని బీఎస్పీ
నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు.
ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ఆమె రోడ్డు పరిస్థితి చూసి, దీనికి కారణమేమిటో స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రోడ్డుపై మైనింగ్ వాహనాలు అధిక లోడుతో వెళ్లడం వలన మొత్తం ధ్వంసమై,అడుగుకో గుంత ఏర్పడి అస్తవ్యస్తంగా మారిందని,అధికార పార్టీకి చెందిన వారి మైనింగ్ కాబట్టి అధికారులు ఈ వైపు చూడడం కూడా మర్చిపోయారని ఆరోపించారు.
తాళ్ళవాయిగూడెంకు వెళ్లే 3 కి.మీ.
రహదారి పూర్తిగా దెబ్బతిని పూర్తిగా రూపమే కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.నల్గొండ సమీపంలో ఇరిగేషన్ శాఖ ఆధీనంలోని కొండలు,గుట్టల్లో నల్గొండకు చెందిన కొందరు గులాబీ లీడర్లు చేస్తున్న అక్రమ మైనింగ్ అరాచకాలకు కట్టంగూరు మండలంలోని పిట్టంపల్లి, తాళ్లవాయిగూడెం, బారేగూడెం,ఇస్మాయిల్ పల్లి,గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కల్వర్టు మరమ్మత్తు పేర అధికార పార్టీ నేతలు కాలువకు పక్కన ఉన్న కొండలని అక్రమ మైనింగ్ చేస్తూ నల్గొండ పట్టణంలోని పెట్రోల్ బంక్ లు,అపార్ట్మెంట్స్ తదితర అవసరాల కోసం భారీ టిప్పర్ వాహనాలలో అధిక లోడును తరలిస్తూ గ్రామాల నుండి పోవడంతో భారీ వాహనాల తాకిడికి రోడ్లు మొత్తం గుంతలమయమై,పూర్తిగా ధ్వంసమై, ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సిన పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు.
ఈ గ్రామాల్లో ఎవరైనా ప్రాణాప్రాయ స్థితిలో ఉంటే కనీసం ఆయా గ్రామాల్లోకి అంబులెన్స్ కూడా వచ్చే అవకాశం లేదని
స్థానికులు బాధను వ్యక్తం చేస్తున్నారని వాపోయారు.
ఇంత జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి తక్షణమే గుంతలమయంగా మారిన ఈ రోడ్ల
మరమ్మతులు చేపట్టి,భారీ వాహనాలు గ్రామాల నుండి రాకుండా చేసి,అక్రమ మైనింగ్ ను కూడా ఆపాలని డిమాండ్ చేశారు.
లేనిఎడల బీఎస్పీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎమ్మెల్యే,సంబంధిత అధికారుల ఆఫీస్ లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
పులినే తరిమికొట్టిన పెంపుడు కుక్క.. ఈ వీడియో చూస్తే..