గృహలక్ష్మి దరఖాస్తుల సమయం పొడిగించాలి: సిపిఐ

సూర్యాపేట జిల్లా: గృహలక్ష్మి దరఖాస్తులకు ఈనెల 8,9,10వ తేదీలు ఇవ్వడం వల్ల నిరుపేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అనేది లేకుండా నిరంతరం కొనసాగేలా చూడాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.

గురువారం జిల్లా కలెక్టరేట్లో ఏవో సుదర్శన్ రెడ్డికి జిల్లా కమిటీ పక్షాన వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇసుక ప్రభుత్వ ఉచితంగా అందించాలని, అదేవిధంగా తక్కువ ధరకు ప్రభుత్వం ద్వారా సిమెంట్ అందించాలని, ఉపాధి హామీ పథకంలో 200 రోజులు లబ్ధిదారుల కుటుంబానికి పని కల్పించి ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలు కాకుండా 5 లక్షల రూపాయలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పట్టాలు లేని ఇంటి స్థలాలు, ప్రభుత్వ భూములలో ఉన్న వారికి అవకాశం కల్పించాలని,కుటుంబ సభ్యులలో ఎవరు పేరు మీద ఉన్న మహిళల పేరుకు మార్పిడి చేసుకొనుటకు గ్రామపంచాయతీలకు మున్సిపాలిటీలకు అనుమతులు ఇచ్చి ఉచితంగా మార్పు చేయించాలని కోరారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణాన్ని అవకాశం కల్పించాలని దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవికుమార్,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్,వ్యవసాయ కార్మిక జిల్లా నాయకులు మాతంగి ప్రసాద్,ఏఐవైఎఫ్ పట్టణ నాయకులు గాలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వైరల్ : అయ్యబాబోయ్.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లాడిన మహిళ..