మునగాలలో మూడు,నేరేడుచర్లలో రెండు ఆర్ఎంపీ కేంద్రాలు సీజ్

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్,ల్యాబ్స్,మెడికల్ షాపులపై జిల్లా వైద్యాధికారుల బృందాల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.

అందులో భాగంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలు కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని మునగాల,నేరేడుచర్ల మండల కేంద్రాల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలు,ల్యాబ్స్,మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు.

మునగాలలో మూడు, నేరేడుచర్లలో రెండు అనుమతులు లేని ఆర్ఎంపి ప్రథమ చికిత్సా కేంద్రాలను,నేరేడుచర్లలో అర్హత కలిగి టెక్నీషియన్లు లేకుండా నడిపిస్తున్న వెంకటేశ్వర ల్యాబ్ మరియు పూర్తిస్థాయి సౌకర్యాలు లేని స్నేహ ల్యాబ్ లను సీజ్ చేశారు.

అయితే తనిఖీల సమాచారం ముందస్తుగా తెలుసుకున్న కొందరు మెడికల్ షాపుల, ల్యాబ్స్ నిర్వాహకులు,ఆర్ఎంపీ వైద్యులు నేమ్ బోర్డులు తొలగించి,కేంద్రాలకు తాళం వేసుకొని పరారయ్యారు.

ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ ప్రతీ ప్రైవేట్ వైద్య కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తామని,అనుమతులు లేకుండా నిర్వహిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంకా కొన్ని ఆస్పత్రులు తాళాలు వేసుకోవడం,వాళ్లు అందుబాటులో లేకపోవడంతో నేరేడుచర్ల వెంకటేశ్వర ఆసుపత్రిని,సాయిశ్రీనివాస ఆస్పత్రులను తనిఖీ చేసి నోటీసులు అందించామన్నారు.

వెంకటేశ్వర ఆస్పత్రిలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం వల్ల నోటీసులిచ్చామని,నోటీసులు అందుకున్న వారు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు.

ఈ తనిఖీల్లో మునగాలలో ఏవో డాక్టర్ శ్రీనివాసరాజ్, డిపిఓ డాక్టర్ కిరణ్,నేరేడుచర్లలో డాక్టర్ నాగయ్య, ప్రత్యేక అధికారులు భూతరాజు సైదులు,మధుబాబు, అంజయ్య,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ప్రారంభం..