తిరుమల:వేస‌విలో భ‌క్తుల ర‌ద్దీకి అనుగుణంగా సౌక‌ర్యాల కల్పిస్తున్నాం‌–అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలుకావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా శ్రీ‌వారి దర్శనానికి రావచ్చని టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.

ధర్మారెడ్డి తెలిపారు,తిరుమల అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ శ్రీవారి సర్వదర్శనం కోసం 7 నుండి 8 గంటల సమయం పడుతోందని, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, షెడ్ల‌లో వేచి ఉండే భక్తులకు నిరంత‌రాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు.

కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపామని, ప్రస్తుతం సిబ్బందిని తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారన్నారు.

సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత వారంలో నాలుగు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామన్నారు.

సోమవారం నుండి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించామన్నారు.శ్రీవారి ఆలయంలో క్యూలైన్ క్రమబద్ధీకరిస్తూ తోపులాట లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోందన్నారు.

రాంభగీచా బస్టాండు, సిఆర్వో, ఏఎన్సి తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు.

పిఎసి-2, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 క్యాంటీన్లో అన్నప్రసాదాల తయారీకి, వడ్డించేందుకు కలిపి 185 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామన్నారు.

భక్తులు సంచరించే అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్వో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచామన్నారు.

ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లు ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నారని తెలిపారు.

భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మెరుగైన ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.

విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు.

ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలియజేశారు.

కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారని తెలిపారు.

కల్యాణకట్టలో శుభ్రం చేసేందుకు 40 మంది అదనపు సిబ్బందిని సమకూర్చుకున్నామని తెలిపారు.రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నారని చెప్పారు.

మీడియా స‌మావేశంలో ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ సెల్వం, శ్రీ భాస్క‌ర్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి పాల్గొన్నారు.

అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?