చుట్టపు చూపుగా వచ్చి అనంతలోకాలకు వెళ్ళిన తీరు…!

సూర్యాపేట జిల్లా: పండుగ పూట చుట్టపు చూపుగా బంధువుల ఇంటికి వచ్చి,గ్రామంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు పొద్దున్నే బయటికి వెళ్లి,తిరుగు ప్రయాణంలో ఓ క్యారీ వద్ద ఉన్న నీటి గుంటలో ఈత కొట్టాలని సరదా పుట్టి,ఈత కొట్టేందుకు గుంతలోకి దిగి ప్రమాదవశాత్తు ముగ్గురు మృత్యువాత పడిన విషాద సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బొప్పారం గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డి ఇంటికి తన అల్లుడు,ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన తిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి(40), తన మిత్రుడు,ఏపీ నరసరావుపేటకు చెందిన రాజు(45) కుటుంబ సభ్యులతో కలిసి ఏకాదశి పండుగ సందర్భంగా రెండు రోజుల క్రితం వచ్చారు.

బుధవారం ఉదయం పల్లె ప్రకృతి అందాలను చూద్దామని శ్రీపాల్ రెడ్డి అతని పెద్ద కుమారుడు చేతన్ రెడ్డి,చామల రాజు అతని ఇద్దరు కూతుర్లు ఉషాంక (12),రిషిక,శ్రీపాల్ రెడ్డి వదిన కూతురు వర్షిత మొత్తం ఆరుగురు కలసి గ్రామ సమీపంలోని బిక్కేరు వాగు వద్దకు వెళ్లి కాసేపు సేద తీరారు.

ఆ తర్వాత శ్రీపాల్ రెడ్డి మామ ఉపేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి వస్తూ చెరువు సమీపంలో ఉన్న క్వారీలో నీటిని చూసేసరికి సరదాగా ఈత కొట్టాలని సరదా పుట్టింది.

క్వారీ గుంత లోతు అంచనా వేయలేక శ్రీపాల్ రెడ్డి పెద్ద కొడుకు చేతన్ రెడ్డికి ఈత రావడంతో దిగి గుంత లోతు చూసి రమ్మన్నారు.

అందులోకి దిగిన చేతన్ రెడ్డి గుంత లోతుగా ఉందని చెప్పేలోగా రాజు,అతని పెద్ద కూతురు ఉషాంక,నీటిలోకి దిగారు.

లోతు ఎక్కువ ఉండడంతో నీటిలోకి జారి పడ్డారు.వారిని కాపాడే ప్రయత్నంలో శ్రీపాల్ రెడ్డి నీటి దగ్గరికి వెళ్లి నీటిలో జారిపడ్డాడు.

అదే సమయంలో రాజు చిన్న కూతురు రితిక కూడా నీటిలోకి జారింది.ఈత వచ్చిన చేతన్ రెడ్డి చిన్న కూతురు రీతికను బయటికి తీసుకొచ్చాడు.

అప్పటికే రాజు,ఉషాంక,శ్రీపాల్ రెడ్డిలు నీటిలో మునిగిపోయారు.బయట ఉన్న రాజు చిన్న కూతురు,శ్రీపాల్ రెడ్డి బంధువుల అమ్మాయి బంధువులకు ఫోన్ చేసి సమాచారం చెప్పి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.

ఈత రాకపోవడంతో అప్పటికే శ్రీపాల్ రెడ్డి,రాజు,ఉషాంకలు నీటిలో మునిగి మృతి చెందారు.శ్రీపాల్ రెడ్డి ఖమ్మంలో బిల్డర్ గా పనిచేస్తుండగా, నరసరావుపేటకు చెందిన రాజు గత కొంతకాలంగా హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

రాజు భార్య,శ్రీపాల్ రెడ్డి భార్య క్లాస్ మెట్స్ కావడంతో వారు రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉందేవారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట డిఎస్ జి.రవి,సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై సైదులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతులను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

పండుగ పూట గ్రామంలో ముగ్గురు చుట్టాలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

క్వారీ చేపట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో క్వారీ చేపట్టడంతో చుట్టుపక్కల పంట పొలాలు దెబ్బ తింటున్నాయని,క్వారీ ద్వారా పెద్ద పెద్ద గోతులు, బండలు ఏర్పడ్డాయని దాని ద్వారా తరచూ పశువులతో పాటు మనుషులు కూడా ప్రమాదాల గురవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

క్వారీ చేపట్టిన వ్యక్తిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభాస్ సినిమాలు రూ.1000 కోట్లు సాధించడం సాధారణం.. అమితాబ్ కామెంట్స్ వైరల్!