హాస్పిటల్ లో టెండర్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో టెండర్ ప్రక్రియ వెంటనే పూర్తి చేసి కనీస వేతనం 15600 ఇవ్వాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నలగొండ యూనిట్ ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.

బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ ముందు టెండర్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కాలపరిమితి ముగిసిన టెండర్లను రద్దు చేసి నూతన టెండర్ ప్రక్రియ చేపట్టి కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినప్పటికీ నలగొండ జిల్లా కేంద్ర హాస్పిటల్ లో గత రెండు నెలలుగా ప్రాసెస్ లో ఉందంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

టెండర్ ప్రక్రియ జాప్యానికి కారణాలేంటో ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలపాలని కోరారు.రాజకీయ నాయకుల ప్రమేయం,తమస్వార్ధ ప్రయోజనాలు కోసం కార్మికులకు నూతన వేతనాలు రాకుండా అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ కు రెండుసార్లు, సూపరింటెండెంట్ కి నాలుగుసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని అన్నారు.

ఇలాగే జాప్యం జరిగితే పూర్తిగా పనులు బంద్ చేసి సమ్మె చేస్తామని హెచ్చరించారు.

తక్షణమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కనీస వేతనం 15600,పిఎఫ్, ఈఎస్ఐ,ప్రమాద బీమా,యూనిఫామ్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్షులు మునగ వెంకన్న,కార్యదర్శి చిన్నబోస్క నరేష్, కోశాధికారి మారం నాగమణి, ఉపాధ్యక్షులు పర్వతం రామయ్య, సహాయ కార్యదర్శిలు వల్కి లలిత,కందుల అండాలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ రాజమౌళి కాంబోలో మూవీ ఫిక్స్.. ఆ విధంగా జక్కన్న చెప్పకనే చెప్పేశాడా?