అధికార పార్టీ ఎంపీపీ ఇల్లునే కూల్చారు!!

సూర్యాపేట జిల్లా:తెలంగాణా రాష్ట్రంలో సామాన్య ప్రజలపైన,లేదంటే ప్రతిపక్ష పార్టీల నేతలపైన,ఇంకా కాదంటే నిజాలను నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టులపైన అక్రమ కేసులు పెట్టి,బలప్రయోగం చేయడం,అరెస్టులు చేయడం, అక్రమ నిర్మాణాలంటూ కట్టడాలను నిలువునా కూల్చివేయడం సర్వసాధారణం.

కానీ,అప్పుడప్పుడు, అక్కడక్కడ కొన్ని విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తూ ఉంటాయి.అలాంటి వింత ఘటనే సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో శుక్రవారం జరిగింది.

అధికార పార్టీకి చెందిన హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ను పోలీసు అరెస్ట్ చేసి,పోలీస్ స్టేషన్ కు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనయాంశమైంది.

హుజూర్ నగర్ పట్టణంలో సదరు ఎంపీపీకి ఇళ్లు నిర్మాణంలో ఉంది.అది మున్సిపాలిటీ లేఔట్ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని,మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి జేసీబీలతో వెళ్లి ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించారు.

దీనితో ఎంపీపీ కూల్చివేతను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.పోలీసులు ఎంపీపీని అరెస్ట్ చేసి, బలవంతంగా పోలీస్ స్టేషన్ కి తరలించడంతో,మున్సిపల్ అధికారులు ఎంపీపీ ఇంటిని పూర్తిగా కూల్చివేశారు.

ఇదంతా చూస్తున్న పట్టణ ప్రజలకు,రాజకీయ పార్టీల నేతలకు ఆశ్చర్యంతో పాటు,అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అధికార పార్టీ ఎంపిపీ పట్ల అధికారులు,పోలీసులు ఇంతటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర కోణం దాగుందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

జరిగిన సంఘటనపై ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ప్లాట్ నెంబర్ 31లో 150 గజాల స్థలం కొనుగోలు చేశాను.

ఇంటినిర్మాణం కొరకు అనుమతి కూడా తీసుకున్నాను.డాక్యుమెంట్ చూపించినా తప్పుడు డాక్యుమెంట్ అన్నారు.

కోర్టుకు వెళ్లాను,కోర్టు నాకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది.అది అధికారులకు కూడా ఇచ్చాను.

అయినా కూడా శుక్రవారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు,సిబ్బంది, పోలీసులతో కలిసి నాపై దాడి చేసి,నా ఇంటిని కూల్చడం జరిగింది.

సీఐ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు.గతంలో ఈ విషయం పల్లా రాజేశ్వర్ రెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి,జిల్లా కలెక్టర్,స్థానిక ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకువెళ్లాను.

వారు చెప్పినా మున్సిపల్ అధికారులు వినకుండా ఇంటిని కూల్చి వేశారు.ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే,బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను రాజకీయగా ఎదుర్కోలేక కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు నా ఇంటిని కూల్చారు.

నిరీక్షణకు తెర.. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా