తెల్ల బంగారం కొనుగోలులో దళారుల చేతి వాటం
TeluguStop.com
నల్లగొండ జిల్లా(Nalgonda District):దేశానికి వెన్నుముక రైతు,రైతే రాజు అంటూ గొప్పగా మాటలు చెప్పే పాలకుల నిర్లక్ష్యంతో భూమిలో నాటే విత్తనం నుండి ఎరువులు,పురుగు మందులు,పంట అమ్మే వరకు ప్రతీ విషయంలో రైతు మోస పోతూనే ఉన్నాడు.
ప్రతీ యేడు మోసపోవడం తిరిగి వ్యవసాయం చేయడం మళ్ళీ మోసపోవడం రైతుకు అలవాటుగా మార్చారు.
ఎక్కడపోయినా కల్తీలే,ఎటు చూసినా దళారులే,అంతా రైతును మోసం చేసేవారే.ఈసారి కాకుంటే వచ్చేసారి అనుకుంటూ మోసాలకు అలవాటు పడిన అన్నదాతలు తనకు తెలిసిన వ్యవసాయం చేస్తూనే ఉన్నారు.
నిత్యం అందరి చేతిలో మోస పోతూనే ఉన్నారు.ఒకవైపు ప్రకృతిలో వచ్చే అతివృష్టి,అనావృష్టి రైతులను అతలాకుతలం చేస్తుంటే మరోవైపు పాలకులు,వ్యాపారులు, దళారులు ఆగం పట్టిస్తుండ్రు.
అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు,అప్పుల బాధ తట్టుకోలేక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పంట తెచ్చే పరిస్థితి లేక విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ (వ్యాపారులను) దళారులను ఆశ్రయిస్తే ఇదే అదునుగా వారు రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు.
ప్రస్తుతం గ్రామాల్లో పత్తి కొనుగోలు వ్యాపారం సాగుతుంది.ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి దళారులు రంగప్రవేశం చేసి,అప్పుల బాధలో ఉన్న రైతులను టార్గెట్ చేసి మార్కెట్ ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తూ,అది చాలదన్నట్లు తూకంలో భారీ ఎత్తున మోసం చేస్తున్నారు.
ఈ దందా ప్రస్తుతం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ( Nampally Mandal , Nalgonda District)జోరుగా నడుస్తుంది.
పత్తి క్వింటాల్(Cotton Quintal) కి మార్కెట్ ధర రూ.7200 ఉండగా దళారులు మాత్రం రూ.
6100 లకే కొనుగోలు చేస్తున్నారు.వీరు పత్తి కాంటాలో ప్రభుత్వ తూకం బాట్లను కాకుండా నాటు రాళ్ళను వినియోగిస్తూ,తరుగు పేరుతో మరో ఐదు కిలోలు అదనంగా కోత పెడుతున్నారు.
రైతులు ఇదేంటని ప్రశ్నిస్తే మేము ఇలాగే జోకుతామని చెపుతూ అడ్డంగా దోచుకుంటున్నారు.
గ్రామాల్లో దళారులు రైతులను మోసం చేస్తున్నా సంబంధిత అధికారులు ఈవిషయంపై పట్టించుకోకపోవడం గమనార్హం.
ఒకవైపు వాతావరణ మార్పులు, మరోవైపు అప్పుల బాధలు,ఇంకోవైపు దళారుల మోసాలు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇప్పటికైనా ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి రైతులు దళారుల బారిన పడకుండా చూడాలని కోరుతున్నారు.
నేను మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి.. సాయిపల్లవి కామెంట్స్ వైరల్!