ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 "ఎ" సెక్షన్ ప్రకారం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల ప్రచార కరపత్రాలు, పోస్టర్ లు, ఫ్లెక్సీ లు ప్రింట్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ చెప్పారు.
శుక్రవారం జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కలెక్టరేట్ లో సమావేశం అయ్యారు.
జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉన్నందున ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించేటప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్లు స్పష్టంగా పైన ముద్రించాలని, ముద్రించిన ప్రతులకు సంబంధించి ప్రచురణ కర్త నుంచి పొందిన డిక్లరేషన్ తో సహా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
జిల్లా లోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణ చేపట్టే ముందు నిర్దేశించిన ప్రోఫార్మాలో సెక్షన్ 127 ఏ (2) ప్రకారం ప్రచురణకర్త నుంచి డిక్లరేషన్ పొందాలన్నారు.
ప్రింటర్ మెటీరియల్ డిక్లరేషనుతో పాటు సూచించిన ప్రొఫార్మాలో ముద్రించిన డాక్యుమెంట్ కాపీల సంఖ్య, సదరు ప్రింటింగ్ పనికి వసూలు చేసిన ధరకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలని తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ యజమానిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారి రామ కృష్ణ, ప్రత్యేక అధికారిని స్వప్న , మీడియా నోడల్ అధికారి మామిండ్ల దశరథం తదితరులు పాల్గొన్నారు.
ఉప్పునీరు తాగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?