ప్రభుత్వ పాఠశాల పక్కనే పందుల షెడ్డు…చదువెట్లా సాగేది సార్లూ…?

నల్లగొండ జిల్లా:చదువుకొనలేక సర్కార్ బడికొస్తే చదువు సంగతి దేవుడెరుగు చచ్చే పరిస్థితి దాపురించిందని నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కురంపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ పాఠశాల పక్కనే ఏర్పాటు చేసిన పందుల షెడ్డు ద్వారా వచ్చే దుర్వాసనతో బడిలో ఉండే పరిస్థితి లేదని, భరించలేని కంపుతో చదవలేక, మధ్యాహ్న భోజనం చేయలేక అవస్థలు పడుతూ వాంతులు చేసుకునే దయనీయ స్థితిలో ఉన్నామని,ఎన్నిసార్లు అధికారులకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.

బడి వేళలో సెలవు రోజుల్లో గేటు ఓపెన్ చేస్తే గ్రౌండ్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని,దీనితో దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే స్కూల్ బిల్డింగ్ కట్టడానికి సుమారు రెండేళ్ళ కిందట ఇసుక గ్రౌండ్లో పోశారు.

కానీ,నేటి వరకు బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయలేదు.ఇవన్నీ చాలదన్నట్టు స్కూల్ గ్రౌండ్లోనే నర్సరీ కూడా ఏర్పాటు చేశారు.

దీనితో పిల్లలు సరిగ్గా చదువుకోలేక,తినలేక,ఆడుకోలేక నిత్యం అవస్థలు పడుతున్నారు.దీనికి తోడు పందుల షెడ్డు,నర్సరీ వలన దోమలు వృద్ధి చెందడంతో ఇబ్బందులు పడుతున్నారు.

పాఠశాలలో సమస్యలు విలయతాండవం చేస్తుంటే చదువులు ఎలా సాగాలని విద్యార్థులు,ఉపాధ్యాయులు సైతం ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పాఠశాలను చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించి,సర్కార్ చదువు చక్కగా సాగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థులు,తల్లిదండ్రులు కోరుతున్నారు.

వావ్, ఏపీలో 139,000 ఏళ్ల నాటి పురాతన రాతి పనిముట్లు లభ్యం..?