పేదలకుఇందిరమ్మ ఇండ్లిచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది

సూర్యాపేట జిల్లా:పేదలకు ఇందిరమ్మ పేరుతో ఇండ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

మంగళవారం పేట మున్సిపాలిటీలో వార్డు వార్డుకు కాంగ్రెస్ పార్టీలో భాగంగా చేపట్టిన పాదయాత్ర మూడో రోజు 26,27వ వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటూ కొనసాగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ తాళ్లగడ్డ,మామిళ్ల గడ్డ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిరుపేదలు నివసిస్తున్నారని,వీరిని ఆదుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి,నాయకులకు చిత్తశుద్ధి లేదా?ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు.

ఇందిరమ్మ గ్రామం,ఇందిరమ్మ కాలనీ పేరుతో పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా 25 వేల ఇండ్లు, పట్టణంలో 4 వేల ఇండ్లు పంపిణీ చేశామని తెలిపారు.

దసరా పండుగ వస్తే కూతురు అల్లుడు ఈ డబ్బా ఇంట్లో ఎలా ఉంటారని? టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ఎటు పోయిందని ఎద్దేవా చేశారు.

సూర్యాపేట పట్టణంలో కేవలం 191 ఇండ్లు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

సూర్యాపేట పట్టణంలో గడిచిన తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిపై మంత్రి జగదీష్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగులకు పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుందే తప్ప వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఉపాధి కల్పనకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు.

వార్డుల్లో నీళ్ల సమస్య తీవ్రంగా ఉందని,పది రోజులకు ఒకసారి నీరు వస్తున్నాయని కాలనీవాసులు తనకు తెలపడం జరిగిందని, ఇలాంటి కష్టం స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ నాయకులకు వస్తే తట్టుకుంటారా అని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ నాయకులకు ఇండ్లకు నీళ్లు రాకుంటే మరుక్షణమే తెప్పించుకుంటున్నారని, మరి వార్డులో ఉన్న వారు మనుషులు కాదా అని ఆవేదన వ్యక్తం చేశారు.

వార్డుల్లో రోడ్లు,కాలువల నిర్మాణం ఎక్కడా సక్కగ లేవని,పింఛన్లు,రేషన్ కార్డులు ఇక్కడ ఏ ఒక్కరికి కొత్తగా రాలేదన్నారు.

వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించేలా టిఆర్ఎస్ నాయకులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు.

లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఇప్పటికే పాదయాత్ర 34 కి.

మీ.పూర్తి చేసుకుందని,అడుగడుగునా పట్టణ ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

అప్పుడు టీడీపీలో ఇప్పుడు వైసీపీలో … వణికిపోతున్నారే ?